వైఎస్సార్‌ జయంతి.. హాట్‌ టాపిక్‌ గా షర్మిల!

జూలై 8 దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతి.

Update: 2024-07-08 07:21 GMT

జూలై 8 దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలను వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ, వైఎస్‌ షర్మిల నేతృత్వంలోని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల చేసిన పని హాట్‌ టాపిక్‌ గా మారింది. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా ‘ఆ రెండు పత్రికలు’ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నిప్పులు చెరిగేవారు. ఆ రెండు పత్రికల యాజమాన్యాల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి కూడా వైఎస్సార్‌ ప్రయత్నించారనే విమర్శలున్నాయి. వైఎస్సార్‌ తోపాటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆ రెండు పత్రికలను ద్వేషభావంతోనే చూసేవారు.

వైఎస్సార్‌ ఆకస్మాత్తుగా మరణించాక తన తండ్రి వారసత్వాన్ని వైఎస్‌ జగన్‌ పుణికిపుచ్చుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై తనకున్న వ్యతిరేకతను చాటుకుంటూ వచ్చారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ వ్యవహారంలో ఈనాడు అధినేత రామోజీరావును, ఆయన కోడలు శైలజను కూడా సీఐడీ చేత జగన్‌ విచారించేలా చేశారు.

అయితే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్‌ షర్మిల మాత్రం తన తండ్రి వైఎస్సార్, తన అన్న వైఎస్‌ జగన్‌ లకు విరుద్ధంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని వైఎస్‌ షర్మిల ఆంధ్రజ్యోతి పత్రికకు రెండు ఫుల్‌ పేజీల యాడ్లు ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ యాడ్లలో ఏపీ కాంగ్రెస్‌ నేతల ఫొటోలు ఏమీ లేవు.

యాడ్లలో వైఎస్సార్‌ నిలువెత్తు ఫొటోతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జులు మాణిక్యం టాగూర్, కేసీ వేణుగోపాల్‌ ఫొటోలను ముద్రించారు.

అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫొటోను కూడా వేయడం గమనార్హం. రేవంత్‌ ఫొటోను మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల కంటే పెద్దగా వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పేజీలో దిగువన నవ్వుతున్న వైఎస్‌ షర్మిల ఫొటోను ముద్రించారు.

వైఎస్సార్‌ 75వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌ లో వేడుకలను నిర్వహిస్తున్నట్టు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఇందులో షర్మిల తన పేరును ‘వైఎస్‌ షర్మిలా రెడ్డి’గా పేర్కొనడం విశేషం. వైఎస్‌ షర్మిలను వైసీపీ, దాని సోషల్‌ మీడియా, వైసీపీకి చెందిన ప్రధాన మీడియా కేవలం ‘షర్మిల’గా మాత్రమే సంభోదిస్తోంది. వైఎస్‌ అనే పేరును కానీ, రెడ్డి అనే పదాన్ని కానీ షర్మిల పేరుకు వైసీపీ, దాని మీడియా చేర్చడానికి ఇష్టపడటం లేదు. ‘వైఎస్‌’, ‘రెడ్డి’ అనే బ్రాండ్‌ జగన్‌ కు మాత్రమే దక్కాలన్నది వైసీపీ ఉద్దేశం.

ఈ నేపథ్యంలో షర్మిల ఆంధ్రజ్యోతి ఇచ్చిన ప్రకటనలో తన పేరును వైఎస్‌ షర్మిలారెడ్డిగా పేర్కొనడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

వైఎస్సార్‌ జీవితాంతం ఏ మీడియాకు వ్యతిరేకంగా అయితే ఉన్నారో అదే మీడియాకు షర్మిల యాడ్లు ఇవ్వడాన్ని వైఎస్సార్‌ మద్దతుదారులు తప్పుబడుతున్నారని అంటున్నారు. అలానే కొంత మంది వైస్సార్ మద్దతుదారులు జగన్ షర్మిల ని వదిలించుకున్నారు అని జగన్ మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోవడం తో వేరే దారి లేక ఆలా చేసింది అని అందులో తప్పు ఏమి లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News