షర్మిల సర్టిఫికేట్..ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కి అది ఇబ్బందేనా !
నిజానికి రాహుల్ గాంధీని 2014లో ప్రధానిని చేయాలని 2009లోనే చెప్పారని షర్మిల ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశారు
తన తండ్రి వైఎస్సార్ కి రాజీవ్ గాంధీ కుటుంబం అంటే ఎంతో అభిమానం అని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. తన తండ్రి బతికి ఉంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ ఎపుడో ప్రధాని అయ్యేవారు అని ఆమె చాలా ఆసక్తికరమీన వ్యాఖ్యలే చేసారు.
నిజానికి రాహుల్ గాంధీని 2014లో ప్రధానిని చేయాలని 2009లోనే చెప్పారని షర్మిల ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశారు. తన తండ్రి వైఎస్సార్ కోరిక అది ఆమె అంటున్నారు. తన తండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడున్నర దశాబ్దాల కాలం సేవలు అందించారని షర్మిల చెప్పడం విశేషం.
ఉమ్మడి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకుని వచ్చింది వైఎస్సారే అని ఆమె స్పష్టంగా చెప్పారు. అంతే కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు తన తండ్రి వైఎస్సార్ అంటే చాలా ఇష్టమని కూడా ఆమె చెప్పారు. ఆ ప్రేమాభిమానాలను ఇపుడు తన మీద చూపిస్తున్నారు అని షర్మిల చెప్పడమూ ఆసక్తికరమే.
ఇలా ఉన్నట్లుండి కాంగ్రెస్ మీద ఇంత ప్రేమను రాహుల్ మీద తనకు ఉన్న అభిమానాన్ని షర్మిల బయట పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. విలీనం రద్దు అన్న తరువాత కాంగ్రెస్ మీద కోపంతో షర్మిల కొన్ని కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాము కాంగ్రెస్ లో విలీనం అయి ఉంటే ఓట్ల చీలిక వచ్చి ఉండేది కాదని ఇపుడు తమ పార్టీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ కే నష్టం అని ఆమె అప్పట్లో మాట్లాడారు.
ఇపుడు ఆమె కాంగ్రెస్ కి ఓపెన్ గా సపోర్ట్ ఇచ్చేశారు. అంతే కాదు సోనియా గాంధీని రాహుల్ గాంధీని పొగుడుతున్నారు. తన తండ్రి ఆశయం రాహుల్ ప్రధాని కావడం అని అన్నారు. మరి షర్మిల ఆశయం కూడా అదేనా అన్నది చర్చగా ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ కి ఎంతో సేవ చేశారు అని చెప్పడం ద్వారా ఆ పార్టీలో తన ప్లేస్ ని బలోపేతం చేసుకోవడానికి ఆమె ఇప్పటి నుంచే చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక వైఎస్సార్ కి ఏకైక వారసురాలిగా తానే ఉన్నానని చెప్పడమూ ఆమె మరో ఉద్దేశ్యంగా ఉంది అంటున్నారు. సరే ఇవన్నీ ఓకే అనుకున్నా వైఎస్సార్ చనిపోయాక మొత్తం వైఎస్సార్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్ళి సోనియాను కలసి వచ్చింది. అపుడు జగన్ షర్మిల విజయమ్మ కూడా ఉన్నారు. మరి నాడు వైఎస్సార్ మీద ప్రేమను సోనియా ఆ ఫ్యామిలీ మీద చూపించలేదా అన్న డౌట్లు వస్తున్నాయి.
ఒకవేళ చూపించినా కూడా కాదనుకుని వైఎస్సార్ ఫ్యామిలీ పార్టీ నుంచి బయటకు వచ్చిందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి విభేదించి జగన్ పార్టీని పెట్టి ఏపీకి సీఎం అయ్యారు. ఇపుడు షర్మిల కాంగ్రెస్ ని పొగుడుతూ మొదటి నుంచి తమది కాంగ్రెస్ కుటుంబమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నాడు అన్న జగన్ కి మద్దతుగా ప్రచారం చేసినపుడు తన తండ్రిని కాంగ్రెస్ అవమానించింది ఆమె చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇపుడు అవన్నీ కేవలం రాజకీయ విమర్శలేనా అన్నది కూడా సందేహంగా ఉంది అంటున్నారు. కాంగ్రెస్ కి వైఎస్సార్ మీద ప్రేమ ఉంది అంటే అది కూడా ఆయన కుమార్తె అంటే కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ కి అది ప్లస్ అవుతుందనే అంటున్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది అన్న సానుభూతి కూడా జగన్ కి వర్కౌట్ అయి ఆయన పార్టీకి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ టర్న్ అయింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
మరి కాంగ్రెస్ కి వైఎస్సార్ అంటే ప్రేమ ఉంది అని షర్మిల సర్టిఫికేట్ ఇచ్చేసిన తరువాత ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కి అది ఇబ్బంది పెట్టేలా ఉందని అంటున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ మీద షర్మిల చేసిన కామెంట్స్ కానీ జగన్ అన్న మాటలు కానీ తప్పుగానే చూడాలా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది.