షర్మిల రాఖీ నారా లోకేష్ కేనా ?
వైఎస్ షర్మిలలో ఇంతటి మార్పుని వైసీపీ అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
వైఎస్ షర్మిలలో ఇంతటి మార్పుని వైసీపీ అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు అన్న జగన్ కి మధ్య ఆస్తి తగాదాలు ఉండవచ్చు. అంతే కాదు ఆమె 2012 నుంచి 2019 దాకా వైసీపీ కోసం పడిన కష్టానికి అన్న నుంచి తగిన ప్రతిఫలం దక్కకపోవచ్చు. కానీ ఆమె అంతకు వేయింతలు అన్నట్లుగా ఏకంగా తండ్రి పేరిట ఏర్పాటు అయిన వైసీపీనే కూల్చేందుకు జగన్ కి రాజకీయ జీవితమే లేకుండా చేసేందుకు సాగిస్తున్న రాజకీయాన్ని చూసి వైసీపీ అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి ఏపీ నుంచి రెండు పార్టీలు రెండు కుటుంబాలు అన్నట్లుగా వైఎస్సార్ నారా ఫ్యామిలీల మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అన్న మాదిరిగానే ఈ కధ సాగుతోంది. షర్మిల సైతం 2023 రెండో అర్ధ భాగం దాకా అలాగే ఉంటూ వచ్చారు. ఆమె వైసీపీలో ఉన్నపుడు నారా కుటుంబాన్ని ఎన్నెన్ని మాటలు అన్నారో కూడా అంతా చూశారు.
ఇదే లోకేష్ ని పట్టుకుని 2019 ఎన్నికల వేళ అ ఆ లు రాని వారు అగ్రతాంబూలం తనకే కావాలని అన్నాడంట. అలా ఉంది లోకేష్ తీరు. ఆయనకు అయిదు శాఖలను చంద్రబాబు ఇచ్చారు అని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక తన కొడుక్కే అయిదు కీలక శాఖలతో మంత్రి పదవి ఇప్పించుకున్నారు అని సెటైర్లు పేల్చారు.
చంద్రబాబుకు ఒక ముని శాపం ఉందని ఆయన నిజం చెబితే తల వేయి ముక్కలు అవుతుందని అందుకే ఎపుడూ అబద్ధమే చెబుతారు అని కూడా షర్మిల ఘాటైన విమర్శలు వైసీపీ మహిళా నేతగా చేశారు. సీన్ కట్ చేస్తే ఆమె తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి అని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆయనతో చాలా సేపు మాట్లాడారు.
దాని కంటే ముందు తెలంగాణాలో పార్టీ పెడతామని ఒక ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు ఇక గత ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ శుభాకాంక్షలు ఆమె లోకేష్ కి చెప్పారు. ఇలా నారా కుటుంబంతో ఆమె తన అనుబంధాన్ని పెంచుకోవడం చూసిన వైసీపీ నేతలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
అయితే రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అని షర్మిల ఎంత చెప్పినా ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు అనే అంటారు. ఉంటే జగన్ ని పదహారు నెలలు బెయిల్ సైతం రాకుండా ఎలా జైలు గోడల మధ్యన ఉంచుతారు అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటారు. వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబం రాజకీయాల్లో లేకుండా చేయడానికి టీడీపీ కాంగ్రెస్ తో చేతులు కలిపి జగన్ మీద కేసులు పెట్టించిన సంగతి మరచారా అని కూడా అడుగుతూ ఉంటారు.
ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేళ ఎట్ హోం పార్టీకి షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో వెళ్లారు. అక్కడ మంత్రి హోదాలో నారా లోకేష్ ఉన్నారు. ఆయన షర్మిలను చూడగానే ఏమి తల్లీ బాగున్నావా అని ప్రశ్నించారు. దానికి బదులుగా షర్మిల బాగున్నా అన్నా అని బదులిచ్చారు. అంతే కాదు ఈ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకోవడం కూడా జరిగింది.
దీంతో ఈ ఇద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో బైట్ ని సోషల్ మీడియాలో టీడీపీ వారు పెట్టి అన్నా చెల్లెళ్ళు అంటే వీరే అన్నటుగా ప్రొజెక్ట్ చేశారు. ఇక జగన్ కి ఏమిటి దారి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా జగన్ కి రాఖీ కట్టడానికి షర్మిల రావడం లేదు.
మరో మూడు రోజులలో రాఖీ పండుగ ఉన్న వేళ ఏమి అన్నా అని నారా లోకేష్ ని షర్మిల పలకరించిదని ఆమెకు అన్నగా లోకేష్ ఉన్నారు కాబట్టి ఆయనకే ఈసారి రాఖీ కడుతుందని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తూంటే షర్మిల టీడీపీ నేతలతో మరీ ముఖ్యంగా నారా కుటుంబంతో కలిసి మెలసి ఉండడాన్ని వైసీపీ నేతలు అయితే ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
అయితే ఆమె పార్టీ వేరు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె వేరే పార్టీ నేతలతో మాట్లాడితే వైసీపీ నేతలకు ఎందుకు బాధ అన్న ప్రశ్నలూ ఉన్నాయి. మొత్తానికి చూస్తే వైసీపీకి షర్మిల మార్క్ షాకులు ఇంకా చాలానే ఫ్యూచర్ లో తగులుతాయని అంటున్నారు.