షర్మిల విపక్షం ఆయుధంగా...!
ఇప్పటిదాకా చంద్రబాబు మాత్రమే ఎంతో కొంత షర్మిల జగన్ ల గురించి ఆ కుటుంబం విభేదాలు గురించి సభలలో విమర్శలు చేస్తూ వచ్చారు.
అనుకున్నదే అవుతోంది. విపక్షానికి సరైన టైం లో ఆయుధంగా షర్మిల మారుతోంది. ఆమె విషయం జనంలో చర్చకు పెట్టి వీలైనంత యాంటీ సీంటిమెంట్ ని వైసీపీ మీదకు ఎగదోసి లబ్ది పొందే ఎత్తుగడ కనిపిస్తోంది. ఇప్పటిదాకా చంద్రబాబు మాత్రమే ఎంతో కొంత షర్మిల జగన్ ల గురించి ఆ కుటుంబం విభేదాలు గురించి సభలలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇపుడు దాన్ని పవన్ అందుకున్నారు.
ఆయన జగన్ మీదకు షర్మిల అంశానే అస్త్రంగా చేసుకుని ప్రయోగిస్తున్నారు. సొంత చెల్లెలుని చూడలేని కాపాడలేని వారు అర్జునుడు ఎలా అవుతారు అని ఒక సూటి ప్రశ్నను పవన్ సంధించారు. సొంత చెల్లెలు మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు అని ఆయన అంటూ అలాంటి వారిని ప్రోత్సహించేలా జగన్ తీరు ఉందని అన్నారు.
జగన్ తనను తాను అర్జునుడిగా చెప్పుకోవడం అసహ్యంగా ఉందని హాట్ కామెంట్స్ చేశారు. అర్జునుడు ఆడపడుచులను కాపాడారు కానీ ఏనాడూ తూలనాడలేదు అని పవన్ చెప్పుకొచ్చారు. తోడబుట్టిన చెల్లెలుకు గౌరవం ఇవ్వని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన నిందించారు. సొంత బాబాయ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన వారిని వెనకేసుకుని వచ్చే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అంటూ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
తనను తాను అర్జునుడిగా చెప్పుకుంటూ ప్రతిపక్షాలను కౌరవులుగా పోల్చుతున్న జగన్ తీరు ఆక్షేపనీయం అన్నారు. అయినా తాను ఆయన మాదిరిగా మహాభారత కధలు ఉదహరిస్తూ ఆ జోలికి పోలేనని పవన్ అన్నారు. ఇది కలియుగం, ఎన్నో పాదం నడుస్తుందో ఎవరికీ తెలియదు కానీ మీరు మాత్రం జగన్ నేను పవన్ మీది వైసీపీ మాది జనసేన అందువల్ల వేరే పోలికలు వద్దే వద్దు అని పవన్ అన్నారు.
ఇక ఎవరు మంచివాళ్లకు అండగా నిలుస్తారో ఎవరు దోపిడీదారులో ప్రజలకు బాగా తెలుసు అని పవన్ జగన్ మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. తాను ఏనాడూ జగన్ ని తగ్గించి మాట్లాడలేదని కానీ సొంత చెల్లెలుకు గౌరవం ఇవ్వలేని వారు మన ఇంటి ఆడపడుచులకు ఏ గౌరవం ఇస్తారు అని పవన్ ఆలోచింపచేసే ప్రశ్నలనే వదిలారు.
వైసీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయం దేశంలో ఎక్కడా ఉండదని పవన్ అన్నారు. ఇక తనకు పవర్ స్టార్ వంటి బిరుదులు అవసరం లేదని తనకు ఏ పవర్ కూడా లేదని ఆయన అన్నారు. తాను ప్రజల మనిషిగా ఉండేందుకే ఇష్టపడతాను అని ఆ బిరుదు తనకు చాలు అని పవన్ మాట్లాడారు. మొత్తానికి జగన్ విషయంలో షర్మిల ఆయుధంగా చేసుకుని విపక్షాలు ప్రత్యేకించి టీడీపీ జనసేన చేసే విమర్శలు ప్రయోగించే సెంటిమెంట్ బాణాలను వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది చూడాల్సి ఉంది.