పార్టీ ఆఫీసులో నిద్రించిన షర్మిళ.. జగన్ సర్కార్ పై ఘాటు కామెంట్స్!
ఈ క్రమంలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్ కు వెళ్లి.. అక్కడ నుంచి గురువారం ఉదయం "ఛలో సెక్రటేరియట్"కు వెళ్లాలని నిర్ణయించారని తెలుస్తుంది.
గురువారం "ఛలో సెక్రటేరియట్" కు ఏపీ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... కుమారుడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న షర్మిల... తొలుత కేవీపీ ఇంటికి వెళ్తారని భావించినా... అనూహ్యంగా రూట్ మార్చేశారు! ఇందులో భాగంగా అంపాపురంలోని కేవీపీ నివాసానికి కాకుండా నేరుగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ కు చేరుకున్నారు.
ఈ క్రమంలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్ కు వెళ్లి.. అక్కడ నుంచి గురువారం ఉదయం "ఛలో సెక్రటేరియట్"కు వెళ్లాలని నిర్ణయించారని తెలుస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లోనే షర్మిల నిద్రించారు. గురువారం ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ విషయాలపై షర్మిళ ఘాటు కామెంట్లు చేశారు.
అవును... ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా?.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా?.. అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా "పార్టీ కార్యాలయంలో రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా?" అంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా ఘాటుగా స్పందించిన షర్మిళ... "నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా?" అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదే సమయంలో... "మేము తీవ్రవాదులమా.. లేక, సంఘ విద్రోహ శక్తులమా?" అని ప్రశ్నించిన ఆమె... "మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే... మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం. మమ్మల్ని ఆపాలని చూసినా.. ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా.. బారికెడ్లతో బందించాలని చూసినా.. నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు" అని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఒక వీడియోని పోస్ట్ చేసిన షర్మిళ... "వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.