బాబాయ్ చెప్పారంటే జగన్ వచ్చేసినట్లేనా...?

ముఖ్యమత్రి జగన్ వీలైతే విశాఖకు ఆగస్టులోనే వస్తారని వైవీ చెబుతున్నారు. అది కనుక కాకపోతే సెప్టెంబర్ ఖాయమని అంటున్నారు.

Update: 2023-07-15 16:51 GMT

విశాఖ వైసీపీ ఈ కధ నాలుగేళ్ళుగా అలా నాన్ స్టాప్ గా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో విశాఖ పాలనా రాజధాని అన్నారు. జనాలు మోజు పడ్డారు. ఆ తరువాత నుంచి అదే మాట పదే పదే చెబుతూంటే జనాలకు ఆసక్తి తగ్గిపోయింది. ఒక దశలో విసుగు కూడా పుట్టుకుని వచ్చింది.

ఇపుడు చూస్తే మూడు రాజధానుల వ్యవహారం తేలేది లేదు. అమరావతి రాజధాని కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. ఇక మధ్యేమార్గం అన్నట్లుగా సీఎం క్యాంప్ ఆఫీసు విశాఖలో ఏర్పాటు చేయడం అన్న దాని మీదనే వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. జగన్ అయితే ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలో మకాం అని చాలా రోజుల ముందే చెప్పుకొచ్చారు. అయితే ఇపుడు మాత్రం ఆ చడీ చప్పుడూ లేదని అంతా అనుకుంటున్న వేళ విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మరో మారు గంభీర ప్రకటన చేశారు.

ఈసారి ఆయన డేట్ ముహూర్తం దగ్గర దాకా వచ్చేశారు. ముఖ్యమత్రి జగన్ వీలైతే విశాఖకు ఆగస్టులోనే వస్తారని వైవీ చెబుతున్నారు. అది కనుక కాకపోతే సెప్టెంబర్ ఖాయమని అంటున్నారు. ఇక న్యాయపరమైన అడ్డంకుల వల్లనే సీఎం రాక ఆలస్యం అవుతోందని సుబ్బారెడ్డి అంటున్నారు.

సీఎం ఆఫీసు విశాఖలో ఏర్పాటు చేయడానికి న్యాయపరమైన అడ్డంకులు ఏమున్నాయో అన్నది ఇపుడు చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ నుంచి అయినా పెట్టుకుని నడపవచ్చు. అది టెంపరరీగానే ఇప్పటిదాకా అంతా చేస్తూ వచ్చారు. కానీ జగన్ మాత్రం విశాఖకు క్యాంప్ ఆఫీసుని పర్మనెంట్ గా చేసుకుంటారా లేక వారంలో రెండు రోజులు విశాఖలో మిగిలిన రోజులు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఉంటారా అన్నదే చూడాల్సి ఉంది.

దీనికైతే రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఆటంకాలు లేవు అనే నిపుణులు మేధావులు చెబుతున్నారు. మరి ఆగస్టు సెప్టెంబర్ లో సీఎం విశాఖకు వస్తారని వైవీ సుబ్బారెడ్డి చెబుతూనే న్యాయపరమైన అడ్డంకులు వల్ల ఆలష్యం అని చెప్పటంతో దాని మీదనే అందరి ఆలోచనలు సాగుతున్నాయి.

మొత్తానికి సీఎం రావడం ఖాయమని బాబాయ్ మాటలలో వ్యక్తం అవుతోంది. జగన్ సొంత బాబాయ్ చెప్పారంటే అది నిజమవుతుందని కూడా అంటున్నారు. మరి జగన్ విశాఖ రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనా అంటే వెయిట్ అండ్ సీ అని అనుకోవాల్సిందే.

Tags:    

Similar News