మోడీకి రెడ్ కార్పెట్ పరిచి వెల్ కం చెప్పిన ఫ్రాన్స్

స్వదేశంలో మోడీ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు

Update: 2023-07-14 05:08 GMT

స్వదేశంలో మోడీ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. అందుకు భిన్నంగా విదేశీ పర్యటనలతో తన ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. స్వదేశంలో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పని ఆయన.. విదేశీ పర్యటనల సందర్భంగా ఎంపిక చేసిన మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ తన వాదనల్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యన వరుస పెట్టి విదేశీ పర్యటనలు చేస్తున్న ఆయన.. ఒక్కో విదేశీ పర్యటన సందర్భంగా తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న ఆయన.. తాజాగా రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు.

అంచనాలకు తగ్గట్లే.. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ప్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ విమానాశ్రయానికి వచ్చి.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. సైనిక వందనాన్ని స్వీకరించారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం జరిగే ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోడీ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ తో భేటీ కార్యక్రమం ఉంది. ఫ్రాన్స్ లో అడుగు పెట్టినంతనే.. ట్వీట్ చేసిన మోడీ.. తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో తాను మాక్రాన్ భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా మోడీ పేర్కొనటం గమనార్హం.

తాను పారిస్ చేరుకున్నానని.. భారత్ - ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు తన పర్యటన దోహదం చేస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఫ్రాన్స్ లోని భారతీయులతో భేటీ కానున్న విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉండే.. మోడీ బస చేసే హోటల్ బయట ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకొని.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇవ్వటం కనిపించింది.

ఈ సందర్భంగా ప్రవాసీయులతో మాట్లాడిన మోడీ.. వారిని అభినందించారు. దేశం కాని దేశంలో కష్టపడేతత్త్వంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. మోడీ మాటల్లో చంద్రయాన్ 3 ప్రయోగం మొదలుకొని పలు అంశాల్ని ప్రస్తావించారు. చంద్రయాన్ 3కు కౌంట్ డౌన్ మొదలైందని.. మరికొన్ని గంటల్లో శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్న రాకెట్ గురించి చెప్పుకొచ్చారు. దేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఫ్రాన్స్ లో నమస్తే ఇండియా అని ఒకరినొకరు సంబోధించుకుంటే.. భారత్ లో బోంజోర్ ఇండియా అని పిలుచుకుంటామన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష తమిళమన్న ఆయన.. అలా చెప్పుకోవటానికి భారతీయుడిగా గర్విస్తున్నట్లుగా మోడీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో తిరుమళ్లువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫ్రెంచ్ ఫుట్ బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాప్పేను భారతీయులు బ్రహ్మరథం పడతారన్న మోడీ.. ఆయనకు సొంత దేశం కంటే అత్యధికంగా భారత్ లోనే అభిమానులు ఉన్నట్లు వ్యాఖ్యానించారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులందరికి సౌకర్యాలు.. భద్రతను కల్పించటానికి తాము కట్టుబడి ఉంటామని.. దేశం ఏదైనా అక్కడ నివసించే భారతీయుల భద్రత కోసం ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాజీ పడమన్న ఆయన.. ప్రవాస భారతీయులకు తీపి కబురు చెప్పారు.

ఫ్రాన్స్ లో యూపీఐను ఉపయోగించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తుందన్న ఆయన.. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ చెల్లింపుల్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. భారత పర్యాటకులు యూపీఐ పేమెంట్స్ ద్వారా స్వదేశ కరెన్సీలో చెల్లింపులు చేయొచ్చన్నారు. అంతేకాదు.. ఫ్రాన్స్ లో మాస్టర్స్ చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఐదేళ్లు లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. మార్కెయిల్ లో కొత్త కాన్సులేట్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News