రూ.5003 కోసం 42 ఏళ్ల న్యాయ పోరాటం.. చివరకు!

ఈ క్రమంలో వెంకట నారాయణకు తప్ప మిగిలిన వారందరికీ ఎకరాకు రూ.5002.50 చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించింది.

Update: 2024-09-29 05:56 GMT

ప్రభుత్వం నుంచి తనకు పరిహారంగా దక్కాల్సిన రూ.5000 కోసం ఒక వ్యక్తి ఏకంగా 42 ఏళ్ల పోరాటం చేయాల్సి వచ్చిందంటే నమ్మగలరా? కానీ.. ఇది నిజంగానే జరిగింది. ఆ వ్యక్తి 81 ఏళ్ల వయసులోనూ తనకు అందాల్సిన పరిహారం పట్టు విడవకుండా కోర్టులో న్యాయ పోరాటం చేశాడు. చివరకు అతడిని న్యాయం దక్కింది. ఇందుకోసం అతడు ఏకంగా 15 ఏళ్లపాటు కోర్టుకెక్కి న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకట నారాయణకు ఆ గ్రామంలో 87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమితో పాటు మరికొందరికి చెందిన మొత్తం 44.43 ఎకరాల భూమిని 1982లో అధికారులు భూ సేకరణ చట్టం కింద తీసుకున్నారు.

ఈ క్రమంలో వెంకట నారాయణకు తప్ప మిగిలిన వారందరికీ ఎకరాకు రూ.5002.50 చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అధికారులు తనకు పరిహారం ఇవ్వలేదని.. మిగిలినవారికి ఇచ్చినట్టే తనకు కూడా పరిహారం ఇవ్వాలని వెంకట నారాయణ అధికారులను కోరుతూ వచ్చారు. అయితే ఆయన వినతిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో వెంకట నారాయణ అధికారులు తనకు పరిహారం చెల్లించేలా ఆదేశాలని కోరుతూ 2009లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ పెండింగ్‌ లో ఉండగానే 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. ఈ క్రమంలో వెంకట నారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి 2023లో తీర్పునిస్తూ సేకరించిన భూమికి గాను ఆయనకు ఎకరాకు రూ.5003 చొప్పున 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని తీర్పు ఇవ్వలేదు.

దీంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ వెంకట నారాయణ ధర్మాసనం ఎదుట 2024లో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ పై ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. వెంకట నారాయణ తరఫు న్యాయవాది ఏవీ శివయ్య వాదనలు వినిపించారు. పిటిషనర్‌ కు చట్ట ప్రకారం పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు దృష్టికి తెచ్చారు.

మిగిలిన వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి పెంచిన మేర పరిహారం చెల్లించిన అధికారులు.. పిటిషనర్‌ కు మాత్రం ఇప్పటి వరకూ చెల్లించకపోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఈ వాదనలతో ఏకీభవించలేదు. తాము వెంకట నారాయణ నుంచి 1982లో భూమిని తీసుకున్నామని.. కాబట్టి అప్పటి భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇస్తామని.. ఆయనకు కొత్త భూసేకరణ చట్టం (2013) ప్రకారం పరిహారం ఇవ్వడం కుదరదన్నారు.

అటు వెంకట నారాయణ, ఇటు ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు నిచ్చింది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం వెంకట నారాయణకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని.. దానికి అనుగుణంగా పరిహారాన్ని నాలుగు నెలల్లో ఇవ్వాలని ఆదేశించింది.

అలాగే ఈ లోపు 1982 ఫిబ్రవరి 16 నుంచి ఈ రోజు వరకు వెంకట నారాయణకు చెల్లించాల్సిన రూ.5003 పరిహారాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి మూడు వారాల్లో చెల్లించాలని కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ రూ.5003, వడ్డీ మొత్తాన్ని మార్కెట్‌ ధర ప్రకారం.. అంతిమంగా చెల్లించే పరిహారంలో సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు విరుద్ధంగా చేస్తే కోర్టు ధిక్కారంగా భావిస్తామని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఇలా 81 ఏళ్ల వయస్సులో మంచంపై ఉండి కూడా వెంకట నారాయణ చేసిన 15 ఏళ్ల న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. ఆయనకు ఇవ్వాల్సిన పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సామాన్య రైతుకు చిన్న మొత్తం పరిహారంగా చెల్లించడానికి ఇన్నేళ్ల సమయం తీసుకోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

భూమి కోల్పోయిన యజమానికి పరిహారం చెల్లించకుండా భూమిని తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. నష్టపోయిన ఆస్తికి పరిహారం కోరడమన్నది పౌరుల రాజ్యాంగ హక్కు అని కుండబద్దలు కొట్టింది. ప్రస్తుత కేసు వంటి అసాధారణ కేసుల్లో న్యాయస్థానాలు అధికరణ 226 కింద తన అధికార పరిధిని ఉపయోగించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Tags:    

Similar News