బెనిఫిట్ షోలపై హైకోర్ట్ సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌లో సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల‌కు అనుమతుల మంజూరు త‌దిత‌ర అంశాలు ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-25 06:43 GMT

తెలంగాణ‌లో సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల‌కు అనుమతుల మంజూరు త‌దిత‌ర అంశాలు ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సమస్యలను హైకోర్టు పరిశీలించిన తర్వాత తాజాగా సంచ‌ల‌న‌ నిర్ణయం వెలువ‌రించింది. సాధారణంగా బెనిఫిట్ షోలు లేదా ప్రత్యేక షోల‌కు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టికెట్ ధరల పెంపు , ప్రత్యేక షోలకు అనుమతులు ఇకపై చెల్లవని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న టికెట్ ధరలు , వినోద ప్రేక్షకులపై ప్రభావం గురించి తెలంగాణ హైకోర్టు తీవ్ర‌ ఆందోళన వ్యక్తం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. తెల్ల‌వారుఝాము 1:30 నుండి ఉదయం 8:40 గంటల మధ్య ఎటువంటి షోలను అనుమతించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

కోర్టు ఆదేశాన్ని పాటించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తన న్యాయ ప్రతినిధుల ద్వారా తెలియజేసింది. టికెట్ ధరల నియంత్రణ, సినిమా ప్రదర్శనల సమయానికి సంబంధించి కొనసాగుతున్న చట్టపరమైన చర్యలలో బెనిఫిట్ షోల రద్దు కీల‌క అంశంగా ప‌రిగ‌ణిస్తున్నారు. సినిమా నిర్మాతలు, పంపిణీదారులకు బెనిఫిట్ షోలు ప్రధాన ఆదాయ వనరు కాబట్టి, ఈ తీర్పు రాష్ట్రంలోని సినీ ఎగ్జిబిష‌న్ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణ ఎఫ్‌.డి.సి ఛైర్మ‌న్ గా అగ్ర‌నిర్మాత‌, పంపిణీదారుడు కం ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు ప‌ద‌వి చేప‌ట్టాక ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప 2` ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట అనంత‌రం తెలంగాణ ప్ర‌భుత్వం టాలీవుడ్ లోని కొన్ని విష‌యాల‌పై సీరియ‌స్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News