లైంగిక బంధానికి ఓకే అందుకు లైసెన్స్ కాదు.. కోర్టు కీలక వ్యాఖ్యలు!
తనపై ఆ మహిళ చేసిన అభియోగాలకు వ్యతిరేకంగా సదరు సర్కిల్ ఇన్సిపెక్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల కాలంలో ఏది లైంగిక వేధింపు, మరేది కాదు అనే విషయాలపై ఉన్నత న్యాయస్థానాలు పలు స్పష్టమైన ఆదేశాలు, వివరణలు ఇస్తున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా ఓ సర్కిల్ ఇన్సిపెక్టర్ వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార ఆరోపణలు కొట్టివేసింది!
అవును... కర్ణాటకలో అశోక్ కుమార్ అనే వ్యక్తి 2017 నుంచి సర్కిల్ ఇనిస్పెక్టర్ (సీఐ) గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఓ మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే... ఏమైందో ఏమో కానీ అతడు తనను శరీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ 2021 మే నెలలో సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఇదే సమయంలో.. తాను ఇచ్చిన కంప్లైట్ ను వెనక్కి తీసుకోకపోతే తన పిల్లలకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. అదేవిధంగా.. 2021 నవంబర్ నెలలో తనను ఓ హోటల్ కు తీసుకెళ్లి, బలాంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని.. అనంతరం తనను సమీపంలోని బస్టాండ్ లో వదిలి వెళ్లినట్లు తెలిపింది.
ఈ ఘటన పైనా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో... తనపై ఆ మహిళ చేసిన అభియోగాలకు వ్యతిరేకంగా సదరు సర్కిల్ ఇన్సిపెక్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చెపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సీఐపై అత్యాచార అభియోగాలను కొట్టివేసింది.
ఇందులో భాగంగా... పరస్పర అంగీకారంతో కొనసాగిన లైంగిక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని.. అయితే, లైంగిక బంధానికి పరస్పర అంగీకారం అంటే మహిళపై దాడి చేయడానికి పురుషుడికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని పేర్కొంది. ఇదే సమయంలో.. దాడి, బెదిరింపుల అభియోగాలను సమర్ధిస్తూ.. వీటిపై సీఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.