ఫ్యామిలీ వద్దంటున్నా జీవ సమాధిని తవ్వమన్న కేరళ హైకోర్టు
అయితే.. అతడి మరణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేవతలు నడయాడే రాష్ట్రంగా పేర్కొనే కేరళలో.. ఇటీవల ఒక వ్యక్తి జీవ సమాధి అయ్యారన్న అంశానికి సంబంధించి కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఈ జీవసమాధికి సంబంధించి అసలేం జరిగిందో తేల్చాలన్నట్లుగా హైకోర్టు డిసైడ్ అయ్యింది. అందుకే.. సదరు వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు ససేమిరా అంటున్నా.. జీవసమాధిని తవ్వాలంటూ విస్పష్ట ఆదేశాల్ని జారీ చేసింది కేరళ రాష్ట్ర హైకోర్టు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఒక వ్యక్తి జీవ సమాధి అయ్యారు. అయితే.. అతడి మరణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో జీవ సమాధిని తవ్వేందుకు పోలీసులు వెళ్లగా వారిని.. కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో.. ఈ వ్యవహారం హైకోర్టు ముందుకు వెళ్లింది. బంధువులు.. స్థానికులకు తెలియకుండా గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ జీవ సమాధి అయ్యారంటూ ఒక రోజు హటాత్తుగా ఊళ్లో పోస్టర్లు వెలిశాయి. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన్ను నెయ్యటింకరలలోని ఒక దేవాలయం సమీపంలో పూడ్చి పెట్టటంపై ఆందోళన వ్యక్తమైంది.
ఎవరూ చూడకుండానే గోపన్ స్వామిని సజీవ సమాధిని చేయటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై గొపన్ స్వామి కుటుంబ సభ్యులు మాత్రం.. తమ తండ్రి కోరిక మేరకే గుట్టుగా జీవ సమాధి చేశామని.. ఎవరూ చూడకుండా చేయాలని తమ తండ్రి ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇందులో ఏదో మతలబు ఉందన్నది స్థానికుల సందేహం. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో కేరళ హైకోర్టు విస్పష్ట ఆదేశాల్ని జారీ చేసింది.
నిజానికి హైకోర్టు ఆదేశాలకు ముందు.. జీవ సమాధిపై సందేహాలు వ్యక్తం చేస్తూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు జిల్లా కలెక్టర్ కు ఒక నివేదిక పంపారు. దీంతోఆయన సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీని సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు. అయితే.. వీరిని గోపన్ స్వామి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జీవ సమాధిని తవ్వేందుకు ససేమిరా అంటూ అడ్డుపడ్డారు. అయితే.. స్థానికులు మాత్రం అందుకు భిన్నంగా సమాధిని తవ్వాలని పట్టుబట్టారు. దీంతో కోర్టు ముందుకు విషయం వెళ్లింది.
సమాధిని తవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. తమ నమ్మకాలను కాపాడాలని సనందన్ హిందూ సంస్థలకు గోపన్ స్వామి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. జీవసమాధి అయిన గోపన్ స్వామికి చూపు కూడా సరిగా లేదని.. అలాంటి వ్యక్తి తనకు తానుగా ఎలా జీవ సమాధి అవుతారు? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రెండేళ్లుగా గోపన్ స్వామి ఇంట్లో నుంచి బయటకు రాలేదని.. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏదో మతలబు ఉందంటున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవ సమాధిని తవ్వి.. పోస్టు మార్టం నిర్వహిస్తే విషయాలన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయని చెప్పక తప్పదు. అయితే.. అందుకోసం మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పదు.