చివర్లో పిన్నెల్లి రిలీజ్ ఎందుకు ఆగింది?
కోర్టు బెయిల్ ఇచ్చేసింది. వాయు వేగంతో బెయిల్ పేపర్లు తయారు చేయించేశారు.
కోర్టు బెయిల్ ఇచ్చేసింది. వాయు వేగంతో బెయిల్ పేపర్లు తయారు చేయించేశారు. జైలుకు వెళ్లి.. పిన్నెల్ల్ని విడుదలను స్వయంగా చూస్తే.. ఆయనకు స్వాగతం పలికేందుకు పలువురు నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అయితే.. అంచనాలకు భిన్నంగా ఆఖరి నిమిషంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి విడుదల శుక్రవారం రాత్రి అనూహ్యంగా ఆగింది.
ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి పిన్నెల్లి విడుదల అవుతారని భావించారు. అందుకు తగ్గట్లే.. ఆయన్ను స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకన్నారు. కాకుంటే..శుక్రవారం మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్ పేపర్లు..కోర్టు నుంచి జైలుకు వచ్చే టైం మించిపోవటంతో పిన్నెల్లి విడుదల ఆగిపోయింది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. శనివారం మధ్యాహ్నాం కానీ.. సాయంత్రం కానీ జరగొచ్చన్న మాట వినిపిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టు పిన్నెల్లికి కండిషనల్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్న సమాచారం అందుకున్న ఆయన అభిమానులు.. మాచర్ల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో విడుదల అవుతారంటూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో పాత వీడియోల్ని చూసుకుంటూ కాలం గడిపారు. అయితే.. కోర్టు పేపర్లు జైలుకు ఆలస్యంగా రావటం.. అప్పటికే ఖైదీల్ని బెయిల్ మీద విడుదల చేసే టైం మించి పోవటంతో పిన్నెల్లి విడుదల ఆగిపోయింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు మాచర్లకు వెళ్లిపోతే.. ఇంకొందరు మాత్రం నెల్లూరులోనే ఉండిపోయారు. ఏమైనా శనివారం ఆయన విడుదల ఖాయమని చెబుతున్నారు.
పిన్నెల్లికి కండీషనల్ బెయిల్ ను మంజూరు చేసిన ఏపీ హైకోర్టు పలు అంశాల్ని ప్రస్తావించింది. బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చే వేళలో అనుసరించాల్సిన నిబంధనల్ని ప్రస్తావించింది. అవేమంటే..
- భారీ ర్యాలీలకు అనుమతి లేదు.
- మీడియాతో మాట్లాడకూడదు
- గుంటూరులో కానీ.. మాచర్లలో కానీ బైక్ ర్యాలీల పేరుతో ఎలాంటి హడావుడి చేయకూడదు
- పూచీకత్తుతో పాటు పాస్ పోర్టును సరెండర్ చేయాలి.
- ప్రతి వారం మేజిస్ట్రేట్.. ఎస్ హెచ్ వో ముందు హాజరు కావాలి
- ఎలాంటి అనుమతులు లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదు.
మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యే పిన్నెల్లి.. ఎక్కడకు వెళతారు? అన్నది ప్రశ్నగా మారింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా మాచర్లకు వస్తారా? లేదంటే.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తాడేపల్లికి వస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.