వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు!

రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Update: 2024-07-04 07:33 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో భారీ ఎత్తున వైసీపీ పార్టీ కార్యాలయాలను నిర్మిస్తోందని అధికార కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు కోట్ల రూపాయలు పలుకుతున్న చోట.. ప్రభుత్వ భూములను అతి తక్కువ లీజుకే దక్కించుకుని ప్యాలెస్‌ లను తలపించే పార్టీ కార్యాలయాలకు శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అనుమతులు లేవనే కారణంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కొద్ది రోజులు క్రితం అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా వైసీపీ అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయాలను నిర్మిస్తుందనే ఆరోపణలతో వాటిని కూల్చివేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీంతో వైసీపీ నేతలు ఈ కూల్చివేతలను ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించింది.

కూల్చివేతకు సిద్ధమయితే ప్రతిదశలో వైసీపీ నేతలు వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో మాత్రమే కూల్చివేతలపై ఆలోచించాలని కోర్టు సూచించింది. అధికారులు అనుమతులు లేవంటూ తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు ౖÐð సీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా హైకోర్టు వైసీపీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తాము వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని.. అనుమతులు తీసుకున్నాకే పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నామని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అలాగే లీజు కింద చెల్లించాల్సిన నిర్దేశిత సొమ్మును కూడా ముందుగానే చెల్లించాలని తెలిపారు.

అన్ని అనుమతులు ఉన్నా, నిర్దేశిత రుసుములు చెల్లించినా కూటమి నేతల ఒత్తిడితో అధికారులు తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్నారని వైసీపీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.

మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కొల్లగొట్టారని.. వేరే అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్లో వైసీపీ కార్యాలయాలను నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోలేదన్నారు.

ఈ నేపథ్యంలో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతల విషయంలో అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగితే వాటిని కూల్చేవేయవచ్చని తెలిపింది. అయితే కూల్చివేతలకు ఉపక్రమించేటప్పుడు ప్రతి దశలోనూ వైసీపీ నేతల వాదనలు కూడా వినాలని సూచించింది.

Tags:    

Similar News