చిరుకు గుడ్ న్యూస్... కేసు కొట్టేసిన హైకోర్టు!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొణిదెల శివశంకర వరప్రసాద్

Update: 2023-07-26 03:52 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొణిదెల శివశంకర వరప్రసాద్ @ చిరంజీవికి ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తాజాగా న్యాయస్థానం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే... 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి గుంటూరు సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 27న జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. నిర్ణీత సమయం ముగిసినా ప్రసంగం కొనసాగించారనేది ఆయనపై అభియోగం.

అవును... 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్ణీత సమయంలో మీటింగ్‌ పూర్తి చేయలేదని.. దానివల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్‌ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు.

ఈమేరకు ఆయనపై గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై దాదాపు 9ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఈ సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

కాగా... 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అనంతరం 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 18స్థానాల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా చిరంజీవికి 18% ఓట్లు రావడం గమనార్హం.

పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి ఆ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. వీటిలో తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. తిరుపతిలో చిరంజీవి 15,930 ఓట్ల మెజారిటీ సాధించారు. పాలకొల్లులో 5,446 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం 2011 ఫిబ్రవరి 6వ తేదీన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.

ఆ ఎన్నికల తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని కూడా చిరంజీవి రెన్యువల్ చేయించుకోలేదు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన "బోళా శంకర్" సినిమా త్వరలో విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News