కాపురం చేసుకుంటూనే రేప్ కేసుకు ఎందుకన్న ఢిల్లీ హైకోర్టు!
న్యాయం కోసం సీరియస్ గా కోర్టుకు వచ్చే వారు మాత్రమే కాదు..కొన్ని సిత్రమైన కేసులు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంటాయి
న్యాయం కోసం సీరియస్ గా కోర్టుకు వచ్చే వారు మాత్రమే కాదు..కొన్ని సిత్రమైన కేసులు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంటాయి. ఇప్పుడు చెప్పే కేసు కూడా ఆ కోవకు చెందిందే. ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి మధ్య ఉన్న సంబంధం.. అనంతరం పెళ్లి విషయంలో వారి మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో కోర్టులో రేప్ కేసు నడుస్తున్న పరిస్థితి. మరోవైపు.. కాలక్రమంలో రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితోనే సదరు మహిళ ఎంచక్కా కాపురం చేసుకుంటున్న వైనంపై ఢిల్లీ హైకోర్టు తాజాగా స్పందించింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
తాను తీసుకున్న నిర్ణయంపై పూర్తి అవగాహన ఉన్న ఒక అమ్మాయి.. ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్ లో ఉంది. అయితే.. తనను పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకొని.. ఆ తర్వాత పెళ్లికి నో చెబుతున్నాడంటూ అతడి మీద రేప్ కేసు పెట్టింది. ఇది కాస్తా కోర్టు ముందుకు వెళ్లింది. కాల క్రమంలో కేసు విచారణకు వచ్చేసరికి పరిణామాలు మారిపోయాయి. రేప్ ఆరోపణలు చేసిన వ్యక్తితోనే సదరు మహిళ పెళ్లి చేసుకొని ఎంచక్కా కాపురం చేయటాన్ని కోర్టు గుర్తించి.. ఆ కేసును కొట్టేసింది.
నిజానికి అమ్మాయి.. అబ్బాయి ఇష్టపూర్వకంగానే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అయితే.. అమ్మాయిని పెళ్లిచేసుకునే విషయంలో అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో.. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి నో చెప్పిన పరిస్థితి. ఈ సందర్భంలో సదరు మహిళ తనను రేప్ చేశారంటూ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకొని తర్వాత నో చెప్పిన వైనంతో తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. విచారణ సమయానికి వీరిద్దరూ పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటున్న విషయానికి కోర్టు గుర్తించింది. దీంతో.. రేప్ కేసును కొనసాగించటంలో అర్థం లేదని తేల్చిన న్యాయమూర్తి కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కేసు విచారణను కొనసాగిస్తే.. చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుందని పేర్కొంటూ కేసును కొట్టేశారు.