రికార్డ్ స్థాయిలో మస్క్ జీతం... కోర్టు సంచలన తీర్పు!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ గతంలో అందుకున్న వేతనం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది

Update: 2024-01-31 10:43 GMT

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ గతంలో అందుకున్న వేతనం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక పారితోషకంగా చెబుతున్నారు. ఫలితంగా... ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా మస్క్ నిలిచారు. అయితే మస్క్ కు భారీ మొత్తంలో వేతనం చెల్లించారంటూ ఒక వాటాదారుడు కోర్టును ఆశ్రయించడంతో వ్యవహరం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ఆ జీతాన్ని వదులుకోవాలని కోర్టు మస్క్ కు సూచించింది.

అవును... టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 2018లో అందుకున్న భారీ జీతాన్ని వదులుకోవాలని డెలావర్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా... కంపెనీ డైరెక్టర్ల బోర్డు తప్పుడు నిర్ణయమే అంత మొత్తంలో వేతనం ఇవ్వడానికి దారి తీసిందని వెల్లడించింది. ఇది కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనికి వాటాదారుల మద్దతు ఉన్నట్లు కూడా నిరూపించలేకపోయారని స్పష్టం చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి ఎలాన్ మస్క్ 55 బిలియన్‌ డాలర్ల వార్షిక వేతనం అందుకున్నారు. అంటే... భారత కరెన్సీలో సుమారు రూ.4.5 లక్షల కోట్లు అన్నమాట. దీంతో... ఈ విషయంపై వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కాథలీన్ మెక్‌ కార్మిక్... వేతన ప్యాకేజీని నిర్ణయించడంలో తప్పు జరిగిందని తేల్చారు.

ఇదే సమయంలో... ప్రపంచంలో మస్క్‌ కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్లు ప్యాకేజీని నిర్ణయించినట్లున్నారు.. ఆయనతో సన్నిహిత సంబంధాలున్నవారే ఈ వేతనాన్ని నిర్ణయించే చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. పైగా ఈ నిర్ణయాన్ని వాటాదారులందరికీ తెలియజేసి వారి ఆమోదం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.. మస్క్ కు ఇంత భారీ వేతనం ఇస్తున్నట్లు చర్చలు జరిపినట్లు కూడా లేదు.. అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు!

కోర్టు తీర్పుపై మస్క్‌ అసహనం!:

ఇలా తాను తీసుకున్న పారితోషకంపై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన ఆయన... డెలావెర్‌ లో కంపెనీలు రిజిస్టర్‌ చేయొద్దని.. టెక్సాస్‌ లేదా నెవాడా రాష్ట్రాలను ఎంపిక చేసుకోవాలని పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ఎక్స్ లో ఒక పోల్ కూడా కండెక్ట్ చేశారు.

ఇందులో భాగంగా... "టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌ కు మార్చాలా?" అని పోల్‌ పెట్టగా... భారత కాలమానం ప్రకారం దీనిపై బుధవారం ఉదయం 6:10గంటల సమయానికి పోల్ పెట్టగా... మధ్యాహ్నానికి 8.7 మిలియన్ వ్యూస్ తో పాటు 6,85,446 మంది పోల్ లో పాటిస్పేట్ చేశారు. ఇందులో 88.2 శాతం మంది "అవును" అని సమాధానమిచ్చారు.

Tags:    

Similar News