వల్లభనేని వంశీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కోర్టు!

ఆగస్టు 20 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వల్లభనేని వంశీ ఊపిరి పీల్చుకున్నారు

Update: 2024-08-14 11:50 GMT

కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయం దాడి, విధ్వంసం కేసుకు సంబంధించి గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆగస్టు 20 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వల్లభనేని వంశీ ఊపిరి పీల్చుకున్నారు.

2014, 2019ల్లో టీడీపీ తరఫున వల్లభనేని వంశీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలిచాక కొద్ది రోజులకే వైసీపీకి అనుబంధంగా కొనసాగారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ లపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు వ్యక్తిగత దూషణలు చేశారు.

ఇక గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. కార్యాలయానికి నిప్పుపెట్టారు. అందులోని ఫర్నీచర్‌ ను, కార్యాలయం బయట టీడీపీ నేతల కార్లను తగులబెట్టారు. వల్లభనేని వంశీ కనుసన్నుల్లో, ఆయన ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు దాఖలు చేయలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు నాడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిలో బాపులపాడు ఎంపీపీ నగేశ్‌ కూడా ఉన్నారు. వీరంతా వల్లభనేని వంశీ అనుచరులే కావడం గమనార్హం.

ఈ క్రమంలో నిందితులంతా వల్లభనేని వంశీ ఆదేశాలతోనే తాము టీడీపీ కార్యాలయంపై దాడి చేశామని వాంగూల్మం ఇవ్వడంతో ఆయనపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం విడిచివెళ్లిపోయారు. ఆయన హైదరాబాద్‌ లో కూడా లేరని చెబుతున్నారు. దీంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసి ఆయన కోసం గాలిస్తున్నారు.

మరోవైపు వల్లభనేని వంశీ తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ పిటిషన్‌ పై పలుమార్లు వాదనలు జరిగాయి. రాజకీయ కుట్ర, వేధింపుల పర్వంలో భాగంగానే వల్లభనేని వంశీ పేరును ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. మరోవైపు టీడీపీ తరఫు న్యాయవాదులు వల్లభనేని వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయాన్ని ఆయన అనుచరులు తగులబెట్టారని.. ఈ మేరకు వారు పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారని నివేదించారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 20 వరకు వంశీపై ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News