సుప్రీం ముందు కీలక అంశం.. నో చెబితే సంచలనమేనట
కీలక అంశం ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం పరిశీలనలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కీలక అంశం ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం పరిశీలనలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ అంశాన్ని సింఫుల్ గా సూటిగా చెప్పాలంటే.. న్యాయమూర్తుల పిల్లలు (సంతానం) హైకోర్టు జడ్జిలుగా అవకాశం ఇవ్వకూడదన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై చర్చిస్తున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. అయితే.. ఈ విధానంలో న్యాయమూర్తుల సంతానానికి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సుప్రీం కోర్టు.. హైకోర్టు ప్రస్తుత.. మాజీ న్యాయమూర్తుల సంతానం.. అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలియజం సీరియస్ గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ తరహా నిర్ణయం కారణంగా అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని.. వారికి ఎలాంటి పరిహారం అందుతుంది? అన్నదిప్పుడు ప్రశ్న.
అయితే.. అర్హులైన కొందరికి అన్యాయం జరిగినప్పటికి.. బంధుప్రీతి లాంటి ఆరోపణలకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతోనే.. ఎంపిక అంశంలో కఠినంగా వ్యవహరించాలన్న వాదన వినిపిస్తోంది. ఇలా చేస్తే.. ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొందరు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ తరహా నిర్ణయంతో తొలితరం న్యాయవాదులతో పాటు.. విభిన్నమైన సామాజిక వర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా పని చేసే వీలు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ చర్చ ఇప్పుడు ఎందుకు తెర మీదకు వచ్చిందంటే.. దానికి కారణం లేకపోలేదు. ఈ నెల (డిసెంబరు) 22న హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం భేటీ అయ్యింది. అనంతరం రాజస్థాన్.. ఉత్తరాఖండ్.. బాంబే.. అలహాబాద్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా ఆరు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా తెర మీదకు వచ్చిన చర్చ.. రానున్న రోజుల్లో సంచలన నిర్ణయం దిశగా అడుగులు పడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.