జిమ్ లో మెడ విరిగి ట్రైనర్ మృతి... వీడియో వైరల్!
అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న బాడీ బిల్డర్
పాముల్ని పట్టేవాడు దాని కాటుకే బలయినట్లు.. గజ ఈతగాడు పిల్ల కాల్వలో పడి మరణించినట్లు.. చాలా మందికి జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి... అదే జిమ్ లో బరువులెత్తుతూ అవి మీదపడి మరణించిన సంగటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సంఘటన పలువురిని కలిచి వేస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న బాడీ బిల్డర్, ఫిట్ నెస్ ప్రియులకు జాగ్రత్తలు చెప్పే ట్రైనర్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మరణించారు. ఈ సంఘటన ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా విక్కీ మెడపై పడడంతో ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తుంది.
అవును... ఇండోనేషియా బాడీబిల్డర్, అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ఫిట్ నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ జస్టిన్ విక్కీ(33) కెమెరా సాక్షిగా ప్రాణం విడిచాడు. సుమారు 400 పౌండ్ల బరువును (210 కేజీలు) ఎత్తే క్రమంలో మెడ విరిగి తీవ్రంగా గాయపడి చనిపోయాడు.
ఈసమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని.. జులై 15వ తేదీన ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
స్క్వాట్ ప్రెస్ కోసం విక్కీ 210 కేజీల బరువున్న బార్బెల్ ను ఎత్తి తన భుజాలపై పెట్టుకున్నాడు. అయితే, అంత బరువును కాయడంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడ్డాడు. దీంతో బార్బెల్ అతడి మెడపై పడింది. దీంతో మెడ విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి గుండె, కాలేయానికి సంబంధించిన నరాల వ్యవస్థ దెబ్బతిందని తెలుస్తుంది. ఫలితంగా అతడు మరణించాడు!