న్యూజెర్సీలో భారతీయ యువకుడు మిస్సింగ్?

అవును... జూలై 15 ఉదయం నుండి 19 ఏళ్ల శైలన్ షే షా అనే భారతీయ అమెరికన్ యువకుడు కనిపించడం లేదని తెలుస్తుంది.

Update: 2023-07-19 04:21 GMT

అమెరికాలోని న్యూజెర్సీలో ఒక భారతీయ యువకుడు అనుమానాస్పద స్థితిలో తప్పిపోయాడని తెలుస్తుంది. ఈ మేరకు ఆ యువకుడి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని వివరాలు ఆన్ లైన్ వేదికగా షేర్ చేస్తూ... ఆచూకీ తెలిస్తే చెప్పాలని వేడుకుంటున్నారు.

అవును... జూలై 15 ఉదయం నుండి 19 ఏళ్ల శైలన్ షే షా అనే భారతీయ అమెరికన్ యువకుడు కనిపించడం లేదని తెలుస్తుంది. దీంతో అతడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకీ కోసం ఎడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అంటున్నారు. లిండా లేన్, వెస్ట్‌ గేట్ డ్రైవ్ పరిసరాల్లో షే చివరిగా కనిపించాడని తెలుస్తుంది.

ఎడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన సమాచారం మేరకు... శైలన్ షా "భారత పురుషుడు, 5 అడుగుల 8 అంగుళాల పొడవు, 140 పౌండ్లు బరువు, నల్లటి జుట్టు, గోధుమ రంగు కళ్ళు" అని గుర్తులు చెప్పారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో తమ కుమారుడి క్షేమం గురించి ఆందోళన చెందుతున్న ఆ యువకుడి తల్లితండ్రులు... రిచ్, కల్పనా షా లు అతనిని గుర్తించడంలో సహాయం కోసం సోషల్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. కమ్యూనిటీ సభ్యులు, సోషల్ మీడియా వినియోగదారుల సహాయాన్ని అర్థిస్తున్నారు.

ఇక ఎడిసన్ పోలీస్ డిపార్ట్‌మెంట్... డ్రోన్ లు, న్యూజెర్సీ స్టేట్ పోలీస్ సెర్చ్ అండ్ రెస్క్యూ యూనిట్ నుండి సహాయం వంటి వనరులను ఉపయోగించి విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్‌ ను ప్రారంభించిందని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు.. అన్ని స్టేషన్ లకూ సమాచారం అందించారని అంటున్నారు.

ఇదే సమయంలో షే గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా, ఏ రహస్యాన్ని చెప్పాలనుకున్నా... నిరభ్యంతరంగా తమతో పంచుకోవాలని.. అలా పంచుకున్నవారి వివరాల గోప్యత విషయంలో హామీ ఇస్తున్నామని అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లు సమాచారం.

కాగా... ఈ ఏడాది ప్రారంభంలో... అర్కాన్సాస్‌ కు చెందిన మరో భారతీయ అమెరికన్ టీనేజ్ తన్వి మరుపల్లి.. తన హైస్కూల్ నుంచి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 29న రెండు నెలల సెర్చ్ తర్వాత ఆమెను ఫ్లోరిడాలో సురక్షితంగా గుర్తించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఈ ఏడాది మే నెలలో టెక్సాస్ లో మరొ 25 ఏళ్ల భారతీయ అమెరికన్ లహరి పతివాడ మిస్సయ్యారు. అనంతరం దాదాపు 322 కి.మీ దూరంలో శవమై కనిపించింది.

Tags:    

Similar News