మ‌న బ‌తుకులేందో చెప్పిన మాట వింటే..

Update: 2017-03-23 07:32 GMT
పాల‌కులు చెప్పే బ‌డాయి మాట‌లు విన‌టం అల‌వాటైన వేళ‌.. నిష్ఠూరం లాంటి నిజం చెప్పిన‌ప్పుడు కాస్త చేదుగా అనిపిస్తుంది. భార‌త్ వెలిగిపోతుంద‌ని కొంద‌రు.. కాదు దూసుకెళ్లిపోతుంద‌ని మ‌రికొంద‌రు.. రానున్న రోజుల్లో మ‌హా శ‌క్తివంతం కానుంద‌న్న‌ది ఇంకొంద‌రు చెప్పే మాట‌ల్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌పంచంలో వివిధ దేశాల ప‌రిస్థితుల గురించి ఐక్య‌రాజ్య‌స‌మితి త‌ర‌చూ ఏదో ఒక అంశంపైన అధ్య‌య‌నం చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి అధ్య‌య‌నం నీటి వ‌న‌రుల మీద చేసింది.

నీటికొర‌త రానున్న రోజుల్లో మ‌రింత పెర‌గ‌నున్న‌ట్లుగా ఐక్య‌రాజ్య‌స‌మితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ వెల్ల‌డించింది. దాని అంచ‌నా ప్ర‌కారం 2040 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి న‌లుగురు పిల్ల‌ల్లో ఒక‌రు నీటి వ‌న‌రులు అతి త‌క్కువ‌గా ఉండే ప్రాంతాల్లో నివ‌సిస్తార‌ని పేర్కొంది. ఇలాంటి వారి సంఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 60 కోట్ల మేర ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో 36 దేశాల్లో నీటి ఎద్ద‌డి అధికంగా ఉంద‌ని.. నీటి స‌ర‌ఫ‌రా కంటే డిమాండ్ అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ట్లుగా వెల్ల‌డించింది.

పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. క‌ర‌వు కార‌ణంగా పిల్ల‌ల ఒంట్లో నీటి శాతం త‌గ్గిపోతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేసిన వైనం చూసిన‌ప్పుడు ఫ్యూచ‌ర్ మీద మ‌రింత భ‌యం క‌ల‌గ‌టం ఖాయం. కేవ‌లం అతిసారం కార‌ణంగా రోజూ ప్ర‌పంచ వ్యాప్తంగా 800 మంది చిన్నారులు (ఐదేళ్ల లోపు వారు) మ‌ర‌ణించటంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచ ప్ర‌జ‌లు నివ‌సిస్తున్న ప్రాంతాల్లో ఏడాదిలో క‌నీసం ఒక నెల‌లోనైనా నీటి కొరత వేధిస్తోంద‌ని ప్ర‌క‌టించింది. ఇలాంటి ఇబ్బంది ఉన్న వారిలో స‌గం మంది భార‌త్‌.. చైనాలోనే ఉన్న‌ట్లుగా పేర్కొంది. మ‌నిషికి అత్యంత అవ‌స‌ర‌మైన నీటి విష‌యంలో దేశ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి అక్క‌డెక్క‌డో ఉన్న ఐక్య‌రాజ్య‌స‌మితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ చెబుతోంది కానీ.. మ‌న పాల‌కులు మాత్రం చెప్ప‌క‌పోవ‌టానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News