అమ‌రావ‌తి పై హైకోర్టు తేల్చిన 10 అంశాలివే

Update: 2022-03-04 09:34 GMT
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే అంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నంగా మారింది. మూడు రాజ‌ధానుల నినాదం ఎత్తుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద షాక్ త‌గిలింది. రాజధానిగా అమ‌రావ‌తే ఉండాలంటూ ఉద్య‌మం చేసిన అక్క‌డి ప్రాంత ప్ర‌జ‌లు, రైతులు ఈ తీర్పుతో పండం చేసుకుంటున్నారు. రాజ‌ధానికి సంబంధించి కోర్టు ముందుకు వ‌చ్చిన వ్యాజ్యాల్లో ముఖ్యంగా తేల్చాల్సిన ప‌ది అంశాల‌ను ధ‌ర్మాస‌నం ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఈ ప‌ది అంశాల‌కు సంబంధించి ఒక్కోదానికి విడివిడిగా వివ‌ర‌ణ ఇస్తూ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. అందులో తొమ్మిది అంశాల్లో పిటిషిన‌ర్ల వాద‌న‌ల‌తో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఏకీభ‌వించింది.

సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి రాజ్యాంగ బ‌ద్ధ‌త ఉంద‌ని, దాన్ని అమ‌లు ప్ర‌భుత్వం అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల చ‌ట్ట‌బద్ధ ఆకాంక్ష‌ల‌ను రాష్ట్రం దెబ్బ‌తీస్తోందా? ఆ చ‌ర్య‌ల‌ను చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌వ‌చ్చా? అనే అంశానికి ప్ర‌భుత్వ చ‌ర్య‌లు రాజ్యాంగ విరుద్ధ‌మే అని హైకోర్టు తేల్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌ర భూ స‌మీక‌ర‌ణ ప‌థ‌కం రూల్స్ (2015)లో చేసిన చ‌ట్ట బ‌ద్ధ వాగ్దానాన్ని ఉల్లంఘించేలా ఏపీ సీఆర్‌డీఏ చ‌ట్టంలోని నిబంధ‌న‌లు ఉన్నాయా? ఒక‌వేళ ఉంటే ఆ చ‌ట్ట‌బ‌ద్ధ హామీల‌ను నిల‌బెట్టుకునేలా ఆదేశాలు జారీ చేయ‌వ‌చ్చా? అనే అంశంలో.. అవును ఆ విష‌యాల్లో కోర్టు ఆదేశాల్ని జారీ చేయ‌వ‌చ్చ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

రాజ్యాంగంలోని 21వ అధిక‌ర‌ణ ప్ర‌కారం జీవించే హ‌క్కును, 300 (ఏ) అధిక‌ర‌ణ ప్ర‌కారం ఆస్తులు కాపాడుకునే హ‌క్కును అమ‌రావ‌తి రైతుల‌కు ద‌క్కుండా ఏపీ సీఆర్‌డీఏలు త‌మ చ‌ర్య‌ల ద్వారా అతిక్ర‌మించాయ‌ని హైకోర్టు ఏకీభ‌వించింది. రాజ్యాంగ వ్య‌తిరేక‌మైన‌, చ‌ట్ట విరుద్ధ‌మైన వాటిని మిన‌హాయించి పాత ప్ర‌భుత్వ విధానాల‌ను కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం మార్చ‌కూడ‌ద‌ని ధ‌ర్మాసనం అభిప్రాయ‌ప‌డింది. అమ‌రావ‌తి ప్రాజెక్టును రాష్ట్ర ప్ర‌భుత్వం ఏపీ సీఆర్‌డీఏ వ‌దిలేశాయా? మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయా? నిబంధ‌న‌ల్లో పేర్కొన్న రైతుల హ‌క్కుల‌ను అవి ఉల్లంఘించాయా? అంటే ఏపీ హైకోర్టు అవున‌ని పేర్కొంది.

స్థానిక పాల‌న సంస్థ‌లు కోరకుండానే మాస్ట‌ర్ ప్లాన్‌ను స‌వ‌రించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉండ‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. రాజ్యాంగంలోని 226 అధిక‌ర‌ణ ప్ర‌కారం హైకోర్టు త‌న అధికార ప‌రిధిని ఉప‌యోగించి నిరంత‌రాయంగా కొన‌సాగేలా రిట్ ఆఫ్ మాండ‌మ‌స్‌ను జారీ చేయొచ్చ‌ని ధ‌ర్మాసనం తెలిపింది. కేటీ ర‌వీంద్ర‌న్ క‌మిటీ, బోస్ట‌న్ క‌న్స‌ల్టెన్సీ గ్రూపు, హైప‌వ‌ర్డ్ క‌మిటీలు స‌మ‌ర్పించిన చ‌ట్ట‌బద్ధంగా లేని నివేదిక‌ల‌ను స‌వాలు చేయాల‌నుకుంటే విడిగా కేసులు దాఖ‌లు చేయాల‌ని కోర్టు సూచించింది. ఏపీ రాజ‌ధానిని, రాష్ట్ర హైకోర్టును రాజ‌ధాని ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి త‌ర‌లించే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని కోర్టు తేల్చిచెప్పింది.
Tags:    

Similar News