అధినేతకు షాక్: చంద్రబాబుతో భేటీకి ఎమ్మెల్సీలు డుమ్మా

Update: 2020-01-26 12:20 GMT
వికేంద్రీకరణ బిల్లు - సీఆర్డీఏ రద్దు బిల్లు - శాసన మండలి రద్దు అంశం ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేసింది. బిల్లులతో పాటు మండలి పరిస్థితి ఏమిటనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది. సోమవారం (జనవరి 27) మండలి రద్దుపై కేబినెట్ కీలక  నిర్ణయం తీసుకోనుందని - అసెంబ్లీలోను చర్చకు రానుందనే వాదనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించాలని భావిస్తున్నారు. అయితే మండలి రద్దు అంశం టీడీపీ ఎమ్మెల్సీలను ఆందోళనకు గురి చేస్తోందట.

వికేంద్రీకరణకు ప్రజలు సానుకూలంగా ఉన్నారని - కేవలం టీడీపీ మాత్రమే దీనిని రాద్దాంతం చేస్తోందని - రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొడుతోందనేది అధికార పార్టీ వాదన. మండలిని అడ్డు పెట్టుకొని అభివృద్ధి చర్యలకు - వికేంద్రీకరణకు టీడీపీ అడ్డు పడుతోందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మండలి రద్దు అంశం తెరపైకి వచ్చింది.

 ఇది వైసీపీ ఎమ్మెల్సీల కంటే టీడీపీ ఎమ్మెల్సీలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. తమ పదవులకు ఎక్కడ ఎసరు పడుతుందోనని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. వైసీపీకి అసెంబ్లీలో పూర్తి బలం ఉందని, పైగా వికేంద్రీకరణకు ప్రజలు సానుకూలంగానే కనిపిస్తున్నారని - కానీ దీనిపై ఆందోళనల వరకు ఓకే కానీ - మరీ పట్టుదలగా వెళ్తే మొదటికే మోసం వస్తుందని మదనపడుతున్నారని తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో చంద్రబాబుకు కొంతమంది ఎమ్మెల్సీలు షాకిచ్చారు. ఆదివారం పార్టీ అధినేత అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ అయింది. ఈ భేటీకి ఆరుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. గాలి సరస్వతి - కేఈ ప్రభాకర్ - తిప్పేస్వామి - శత్రుచర్ల విజయ రామరాజు - రామకృష్ణ - శమంతకమని డుమ్మా కొట్టారు. వారు పార్టీ అధినేతకు కూడా సమాచారం ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా - వికేంద్రీకరణపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాంధ్ర - రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజకీయ భవిష్యత్తుపై ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - కీలక నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో ఏపీలో ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.

తమ పార్టీ నేతలను వైసీపీ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది. కానీ రాజకీయ భవిష్యత్తు కోసం సీమ - ఉత్తరాంధ్ర నేతలు వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తే ప్రజలు తమను ఛీకొడతారని - ఇప్పటికే ఒకేచోట అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ వంటి ముఖ్య నగరాన్ని నష్టపోయామని - ఇప్పుడు అమరావతిలోనే అభివృద్ధి అంటే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరని ఆందోళన చెందుతున్నారట.

తమ తమ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌ ని చూపిస్తూ జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి సానుకూలంగా ఉన్నారని, కానీ తమ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం దీనిని వ్యతిరేకించడం సమంజసం కాదని ఆయా ప్రాంతాల కీలక నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఒకరిద్దరు నేతలు - ఎమ్మెల్యేలు కూడా పార్టీ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వికేంద్రీకరణ బిల్లుకు మద్దతు తెలపకుంటే తాము రెండు విధాలా నష్టపోతామని టీడీపీ ఎమ్మెల్సీలు డైలమాలో ఉన్నారట. ఓవైపు మండలిని రద్దు చేస్తే పదవులు కోల్పోతామని, ఇది తాత్కాలికంగా తమకు దెబ్బ అని - దీంతో పాటు తమ ప్రాంతంలో పట్టు కోల్పోతామని - ప్రజలు తమను నిలదీసే పరిస్థితులు వచ్చి రాజకీయ భవితవ్యం లేకుండా పోతుందని వాపోతున్నారట. కాబట్టి ఏం చేయాలనే అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.


Tags:    

Similar News