శబరిమల దర్శనానికి ప్రయత్నించిన 10 మంది విజయవాడ మహిళలు

Update: 2019-11-16 13:26 GMT
శబరిమల అయ్యప్ప ఆలయ దర్శనానికి పది మంది మహిళలు ప్రయత్నించారు. ఆ పది మంది మహిళలూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని కేరళ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశానికి గత ఏడాదికి కోర్టు అనుమతివ్వడం.. దానిపై రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా మొన్ననే కేసును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించడం తెలిసిందే. అయితే, సమీక్ష పూర్తయ్యేలోగా గత ఏడాది ఇచ్చిన తీర్పుపై స్టే ఉండదని కోర్టు తెలిపింది. దీంతో ఈ రోజు నుంచి తలుపులు తెరుచుకుంటున్న శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు 10 మంది మహిళలు ప్రయత్నించారు.

ఈ పది మంది మహిళలు విజయవాడకు చెందినవారని... వారు విహారయాత్ర కోసం కేరళ వచ్చి.. శబరిమల ఆలయ ద్వారాలు ఈ రోజు తెరుచుకుంటున్నాయని తెలిసి అక్కడకు చేరుకున్నారని పటానంతిట్ట పోలీసులు చెబుతున్నారు. అయితే, సుప్రీంకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవని, తాము రక్షణ కల్పించలేమని.. తిరిగి వెళ్లిపోవాలని సూచించడంతో వారు వెనక్కు వెళ్లిపోయారని చెబుతున్నారు.

కాగా కేరళ ప్రభుత్వం కూడా శబరిమల దర్శనానికి వచ్చే మహిళా అయ్యప్ప భక్తులకు తాము రక్షణ కల్పించబోమని ప్రకటించింది. అయ్యప్ప దర్శనానికి మహిళలు రావద్దని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రచారం కోసం వచ్చేవారు అస్సలు రావొద్దని.. అలాంటి ఉద్దేశాలతో వచ్చేవారు కోర్టు అనుమతి, రక్షణ కల్పించాలని కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని వస్తే రక్షణ కల్పించే అంశం పరిశీలిస్తామని కేరళ మంత్రి ఒకరు ప్రకటించారు.
Tags:    

Similar News