ఆ రాష్ట్రంలో 100 రాబందులు ఒక్కసారి చనిపోయాయి

Update: 2022-03-19 03:52 GMT
షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకేసారి పెద్ద ఎత్తున రాబందులు చనిపోయిన ఉదంతం అసోం రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలాన్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఉదంతం అందరిని నిశ్చేష్టులయ్యేలా చేస్తోంది. ఒకేచోట దాదాపు వందకు పైనే రాబందులు నిర్జీవంగా పడి ఉన్న వైనాన్ని చూసినోళ్లందరికి నోట మాట రాని పరిస్థితి.

ఎందుకిలా జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ అంశంపై స్థానిక అటవీ అధికారులు స్పందించారు. చనిపోయిన వంద రాబందులే కాదు.. మరిన్ని రాంబందులు అస్వస్థతకు గురైనట్లుగా గుర్తించారు. వాటికి చికిత్స అందిస్తున్నారు.

ఇంతకూ ఇదంతా ఎలా జరిగిందన్న విషయాన్ని ఆరా తీయగా.. రాబందులు చనిపోయిన ప్రదేశంలో గొర్రెల మాంసం.. ఎముకలు లభ్యమైనట్లుగా గుర్తించారు. ఇలా ఒకేసారి వంద రాబందులు చనిపోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

చనిపోయిన గొర్రెల మాంసం విషపూరితం అయి ఉండొచ్చని.. వాటిని తిన్నందుకే రాబందులు మరణించి ఉంటాయని బావిస్తున్నారు. రాబందుల మరణానికి కచ్ఛితమైన కారణం పోస్టుమార్టం రిపోర్టులో తేలనుందని చెబుతన్నారు.

కొందరు అటవీ శాఖ అధికారుల అంచనాప్రకారం కావాలనే గొర్రెల మాంసంలో విషం కలిపి రాబందులు తినేలా చేశారన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ఆరంభంలోనూ ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే.. అప్పట్లో ఇన్ని రాబందులు చనిపోలేదని.. తాజా ఉదంతంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందంటున్నారు. ఏమైనా.. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News