పెద్ద నోట్ల ర‌ద్దు: ఇపుడు ఏం జరుగుతుందంటే

Update: 2016-11-09 05:20 GMT
దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ నుంచి రూ.500, రూ.1,000 క‌రెన్సీ నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా ఏమాత్రం స‌మ‌యం ఇవ్వ‌కుండానే కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చేశారు. ఆ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక పెద్ద క‌స‌రత్తే ఉంద‌ని, ఈ నిర్ణ‌యం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కొత్త జ‌వ స‌త్వాలు ఇవ్వ‌నుంద‌ని, అవినీతికి అడ్డుకట్ట ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెప్పారు. వెర‌సి అంతా పార‌దర్శ‌కంగా మారిపోతుంద‌ని కూడా మోదీ సెల‌విచ్చారు. ఈ నిర్ణ‌యంపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ముందుగా షాక్ తిన్నా.. ఆ త‌ర్వాత మోదీ ప్ర‌సంగం సారాంశం తెలుసుకుని శాంతించారు. ఇక కేంద్రం తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌ల‌కు తెర లేసింది. ఈ నిర్ణ‌యం సత్ఫ‌లితాల‌నే ఇస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నా... ఆ ప్ర‌భావం ఎలా ఉంటుంది? ఎంత కాలంలోగా దీని ప్ర‌భావం ఉంటుంది? ఏఏ అంశాలు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతాయి? అన్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే... డిజిట‌ల్ దీప‌క్‌.కామ్ అధినేత దీప‌క్ క‌న‌క‌రాజు దీనిపై స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ అభిప్రాయం ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మే అయినా... దాదాపుగా ఈ అభిప్రాయంతో ప‌లువురు ఆర్థిక వేత్తలు ఏకీభ‌విస్తున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వెనువెంట‌నే జ‌రిగే ప‌రిణామం...  బ్యాంకుల్లో డిపాజిట్లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతాయి. ఎందుకంటే న‌ల్ల కుబేరుల‌ను ప‌క్క‌న‌బెడితే... నిజాయతీగా క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న సొమ్మును దేశ ప్ర‌జ‌లు వెనువెంట‌నే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. బ్యాంకుల‌కు రాకుండా ఆయా వ్య‌క్తుల ఇళ్ల‌ల్లోని బీరువాల్లో దాగున్న నోట్లంతా ఒక్క‌సారిగా బ్యాంకుల ద‌రి చేర‌డంతో సీఆర్ఆర్ (క్యాష్ రిజ‌ర్వ్ రేషియో) అమాంతంగా పెరుగుతంది. ఫ‌లితంగా రుణ ప‌రిమితి పెరుగుతుంది. వ‌డ్డీ రేట్లు త‌గ్గిపోతాయి. వెర‌సి అడిగిన వారికంద‌రికీ రుణాల‌ను అందించే వెసులుబాటు బ్యాంకుల‌కు ఉంటుంది. ఇలా రుణాలు ఇచ్చుకుంటూ పోతే... మార్కెట్‌లో న‌గ‌దు చెలామ‌ణి విపరీతంగా పెరిగిపోతుంది. ఫ‌లితంగా ద్ర‌వ్యోల్బ‌ణం కూడా పెరిగిపోతుంది. అయితే ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం రాత్రికి రాత్రే జ‌ర‌గ‌దు. దీనికి చాలా కాల‌మే ప‌డుతుంది.

ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డానికి కొంత స‌మ‌య‌మే ప‌ట్టినా... ప్ర‌తి ద్రవ్యోల్బ‌ణం మాత్రం రాత్రికి రాత్రే పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఎందుకంటే దేశంలోని న‌ల్ల కుబేరులంతా త‌మ అక్ర‌మ సంపాద‌న‌ను రూ.500, రూ.1,000 నోట్ల‌లోనే దాచుకుని ఉంటారు. ఈ నోట్ల ర‌ద్దుతో వారు ఆ నోట్ల క‌ట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే లెక్క‌లు చెప్పాల్సి వ‌స్తుంది. దీనికి భ‌య‌ప‌డే వారు ఆ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌రు. ఫ‌లితంగా న‌గ‌దు బ్యాంకుల బ‌య‌టే పేరుకుపోతుంది. దీంతో న‌గ‌దు చెలామ‌ణి త‌గ్గ‌డంతో ప్ర‌తి ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతుంది.

ప్ర‌తి ద్రవ్యోల్బ‌ణం కార‌ణంగా ధ‌ర‌లు కింద‌కు దిగుతాయి. దేశ క‌రెన్సీ విలువ పెరుగుతుంది. ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింతగా ప‌టిష్ట‌మ‌వుతుంది.  అన్ని ర‌కాల ధ‌ర‌లు దిగివ‌స్తాయి. బంగారం విలువ కూడా దిగొస్తుంది. తొలి ఆరు నెల‌ల నుంచి ఏడాది దాకా ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంది. ఆ త‌ర్వాత క్ర‌మంగా ద్ర‌వ్యోల్బ‌ణం కూడా క్ర‌మంగా పెర‌గ‌డంతో... ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కీల‌కంగా ప‌రిగ‌ణిస్తున్న ద్ర‌వ్యోల్బ‌ణం - ప్ర‌తి ద్ర‌వ్యోల్బ‌ణం రెండూ ఒక‌దానినొక‌టి బేల‌న్స్ చేసుకుంటూ వెళ‌తాయి. ఫ‌లితంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మరింత బ‌లోపేత‌మ‌వుతుంది.

రియ‌ల్ ఎస్టేట్ రంగం కూడా పెద్ద నోట్ల ర‌ద్దుతో భారీగా ప్ర‌భావితం కానుంది. ఎందుకంటే రియ‌ల్ ఎస్టేట్ రంగంలోని మెజారిటీ వ్యాపారులు న‌ల్ల కుబేరులుగానే ఉన్నారు. వీరంతా రాత్రికి రాత్రి త‌మ వ‌ద్ద ఉన్న పెద్ద నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవ‌కాశాలు లేవు.  అంతేకాకుండా ఏదేని ప్రాప‌ర్టీని కొనుగోలు చేసేందుకు కూడా వారు అంత త్వ‌ర‌గా ముందుకు రార‌నే చెప్పాలి. ఎందుకంటే వారి వ‌ద్ద ఉన్న‌దంతా న‌ల్ల‌ధ‌న‌మే కాబ‌ట్టి. ఫ‌లితంగా తొలి నాళ్ల‌లో ఈ రంగం కాస్తంత  మందగిస్తుంద‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత వైట్ మ‌నీ ఉన్న వారికి కూడా ఈ రంగంలో అవ‌కాశాలు పుష్క‌లంగా ల‌భించ‌డంతో ఈ రంగం క్ర‌మంగా వృద్ధి చెందుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News