హుజూరాబాద్ బ‌రిలో 1000 మంది అభ్య‌ర్థులు...!

Update: 2021-10-05 02:30 GMT
తెలంగాణ‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతోన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఫీల్డ్ అసిస్టెంట్లు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. త‌మ డిమాండ్లను ప‌ట్టించుకోనుందుకు నిర‌స‌న‌గా ఒక‌రు కాదు .. ఇద్ద‌రు కాదు ఏకంగా 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేష‌న్లు వేసి స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. 2019 ఎన్నిక‌ల‌లో అప్పుడు ప‌సుపు రైతులు ప్ర‌భుత్వం త‌మ గోడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిజామాబాద్ లోక్‌స‌భ స్థానంలో భారీ ఎత్తున నామినేష‌న్లు వేశారు. ఆ ఎన్నిక‌ల‌లో ప‌సుపు రైతులు అంద‌రూ క‌లిసి 95 వేల ఓట్లు చీల్చారు. కేసీఆర్ కుమార్తె 70 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు.

అయితే ఇప్పుడు మ‌రోసారి హుజూరాబాద్‌లో కూడా అదే జ‌రుగుతుందా ? అన్న టెన్ష‌న్ అధికార పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. గ‌తేడాది ఫీల్డ్ అసిస్టెంట్లు త‌మ క‌నీస డిమాండ్లు నెర‌వేర్చాలంటూ స‌మ్మె చేశారు. అయితే అదే స‌మ‌యంలో క‌రోనా రావ‌డంతో వారి స‌మ్మెను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. పైగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స‌మ్మె చేశారంటూ వారిని తొల‌గించ‌డంతో వారు ఉపాధి పోయి రోడ్డున ప‌డ్డారు. త‌ర్వాత ఈ బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు బ‌దిలీ చేసింది. దీంతో వారు తిరిగి విధుల్లో చేరే అవ‌కాశం కూడా ఇప్పుడు లేదు.

దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వంపై రివేంజ్ తీర్చుకునేందుకు ఈ ఉప ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తూ త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. అయితే ఎన్నిక‌ల‌లో పోటీ చేయాలంటే ప్ర‌తి ఒక్క‌రు రు. 10 వేల డిపాజిట్‌తో పాటు వారికి స‌పోర్ట్‌గా క‌నీసం 10 మంది సంత‌కాలు చేయాలి.. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ చందాలు సేక‌రించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వీరు పోటీ చేయాల‌ని అనుకున్నా.. అప్ప‌ట్లో కేసీఆర్ హామీ ఇవ్వ‌డంతో వీరంతా వెన‌క్కు త‌గ్గారు. ఆ త‌ర్వాత వీరిని మ‌ర్చిపోవ‌డంతో ఇప్పుడు తిరిగి వారు ఇక్క‌డ పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను ఓడిస్తామంటూ శ‌ప‌థాలు చేస్తున్నారు. పైగా 18 నెల‌లుగా జీతాలు కూడా ఇవ్వ‌కుండా త‌మ‌ను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నార‌ని కూడా వారు వాపోయారు. అయితే తిరిగి త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చి.. విధుల్లోకి తీసుకుంటే మాత్రం తాము త‌ప్పుకుంటామ‌ని చెపుతున్నారు.
Tags:    

Similar News