సీఎం జగన్ కు అధికారులు కథలు చెబుతున్నారా?

Update: 2020-04-23 04:45 GMT
ఎవరైనా.. ఏదైనా పని చేసినప్పుడు.. దానికి సంబంధించిన గొప్పల్ని ప్రచారం చేసుకోవటానికి తహతహలాడిపోతారు. తమ సత్తా ఎంతన్న విషయాన్ని చెప్పుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు. ఈ తరహా ఉత్సాహం మంచిదే కానీ.. మోతాదు మించితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఏపీ అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి చెబుతున్న కథలు ఈ కోవలోకే వస్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  కరోనా కష్టంలో ఉన్న వేళ.. అధికారుల మనసుల్ని నొప్పించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి.

ఇందులో భాగంగా వారి తప్పుల్ని సరిదిద్దుతూ.. వారిని ప్రోత్సహిస్తూ.. మరింత శ్రమించేలా చేస్తున్నారు. కరోనా కట్టడికి జగన్ ఏమి చెయ్యాలో అన్ని పనులు వేగంగా చేస్తున్నారు . ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రికే కథలు చెబుతున్న వైనం షాకింగ్ గా మారింది. ప్రపంచంలో తన అవసరం ఎక్కడున్నా.. నిర్మోహమాటంగా లాగేసుకునే తీరు అమెరికాకు ఎంత ఎక్కువన్న విషయం తెలిసిందే. యూరప్ లోని పలు సంపన్న దేశాలకు వెళ్లాల్సిన కరోనా కిట్లను.. ఇతర సామాగ్రిని అగ్రరాజ్యం లాగేసుకోవటంపై ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.

సంక్షోభంలో ఉన్నప్పుడు తన స్వార్థం మినహా మరేమీ పట్టవన్న విమర్శల్ని అమెరికా మూటగట్టుకుంది. మాస్కులు మొదలు కరోనా నిరోధానికి అవసరమయ్యే ఏ వస్తువు విషయంలో అయినా అమెరికా ఆడే తొండాట తెలిసిన విషయమే. అలా అందరికి తెలిసిన విషయాన్ని సైతం మర్చిపోయిన ఏపీ అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా టెస్టు కిట్లను చాలా శ్రమతో ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకొచ్చినట్లుగా అధికారులు చెప్పుకున్నారు.

ఈ మాత్రం గొప్పల్ని లైట్ తీసుకోవచ్చు. కానీ.. ఇక్కడే లైన్ దాటేసిన కొందరు ఉన్నతాధికారులు చెప్పిన మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. రాజస్థాన్ లో వినియోగిస్తున్న చైనా కిట్లను తొలుత పరీక్షించగా.. అంత బాగోలేవని.. అదే సమయంలో కొరియా కిట్లను పరిశీలిస్తే బాగున్న విషయాన్ని గుర్తించామన్నారు. అందుకే.. చాలా శ్రమకు ఓర్చి.. ప్రత్యేక విమానంలో కొరియా నుంచి కిట్లను తెప్పించినట్లుగా అధికారులు చెబుతున్నారు.

అక్కడితో ఆగని వారు.. కొరియా నుంచి అమెరికాకు వెళ్లాల్సిన ర్యాపిండ్ టెస్టు కిట్లను ఆంధ్రాకు తీసుకొచ్చినట్లుగా చెప్పే మాటలే అతిశయంగా మారాయి. సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయటానికి అమెరికా పేరును వాడేసిన తీరుతో అడ్డంగా బుక్ అయ్యారని చెబుతున్నారు. ఆగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లాల్సిన ర్యాపిడ్ టెస్టు కిట్లు ఆంధ్రాకు రావటమా? అంటూ విస్మయానికి గురవుతున్నారు. ఏమైనా అనుకుంటారన్న ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్లుగా సీఎం జగన్ వద్ద కోతలు కోస్తున్న అధికారుల తీరు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News