రూ.104 కోట్ల విలువైన డ్ర‌గ్స్ త‌ర‌లిస్తూ..

Update: 2021-07-10 01:30 GMT
ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా 104 కోట్ల రూపాయ‌ల విలువైన డ్ర‌గ్స్ ను త‌ర‌లిస్తూ.. చివ‌రి నిమిషంలో పోలీసుల‌కు ప‌ట్టుబడ్డాడో వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న కెన‌డాలో చోటు చేసుకుంది. త‌ర‌లిస్తూ పోలీసుల‌కు దొరికిన వ్య‌క్తి భార‌త సంతతికి చెందిన యువకుడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే...

భార‌త సంత‌తికి చెందిన ప్ర‌దీప్ సింగ్ క్యూబెక్ లో నివ‌సిస్తున్నాడు. మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ప్ర‌దీప్‌.. అమెరికా నుంచి భారీ మొత్తంలో కెన‌డాకు త‌ర‌లిస్తున్నాడు. ఈ క్ర‌మంలో అమెరికా నుంచి తెచ్చిన స‌రుకును కెన‌డా స‌రిహ‌ద్దులు దాటిస్తుండ‌గా.. అధికారులు చేసిన త‌నిఖీల్లో దొరికిపోయాడు.

క‌రోనా నేప‌థ్యంలో.. కెన‌డా దేశ స‌రిహ‌ద్దులో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. కేవ‌లం అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు మాత్ర‌మే అధికారులు అనుమ‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారిలో క‌లిసిపోయేందుకు ప్ర‌య‌త్నించిన ప్ర‌దీప్ సింగ్‌.. అడ్డంగా బుక్క‌య్యాడు. ఓ ట్ర‌క్ లో ఈ డ్ర‌గ్స్ ను త‌ర‌లిస్తున్న ప్ర‌దీప్ ను అడ్డ‌గించి, త‌నిఖీ చేయ‌గా.. ఏకంగా 112.5 కేజీల కొకైన్ బ‌య‌ట‌ప‌డిందని అక్క‌డి అధికారులు తెలిపారు.

భార‌త క‌రెన్సీలో దీని విలువ ఏకంగా 104 కోట్ల రూపాయ‌లు. ఈ డ్ర‌గ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్ర‌దీప్ సింగ్ ను అరెస్టు చేసి, జైలుకు త‌ర‌లించారు. అనంత‌రం కోర్టు ఎదుట హాజ‌రు ప‌రిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వ్య‌క్తి వ‌ద్ద ఇంత మొత్తంలో కొకైన్ ప‌ట్టుబ‌డ‌డం చాలా అరుదు. ఒక వ్య‌క్తి వ‌ద్ద పావు కేజీ వ‌ర‌కు ఈ డ్ర‌గ్ ఉంటేనే.. పెద్ద నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటిది.. వంద కేజీల పైన కావ‌డంతో.. కోర్టు ఎలాంటి శిక్ష‌విధిస్తుందో చూడాలి.
Tags:    

Similar News