ఎన్నికలను బహిష్కరించిన 108 గ్రామాలు

Update: 2020-10-24 15:00 GMT
బీహార్ ఎన్నికల వేడి రాజుకుంది. అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష కూటమి హామీలతో ఓటర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే అసంతృప్తి గళాలు ఈ ఎన్నికల సందర్భంగా బయటపడుతున్నాయి.

ఈ క్రమంలోనే బీహార్ లోని 108 గిరిజన గ్రామాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పోలీసుల దాడికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించాయి.

తాజాగా కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి 25మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులను ఉపయోగించి అటవీశాఖ బలవంతంగా దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు.

కైమూర్ ప్రాంతంలోని 108 గిరిజన గ్రామాల ప్రజలు పోలింగ్ ను బహిష్కరిస్తారని కైమూర్ ముక్తి మోర్చా ప్రకటించింది. కైమూర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించడాన్ని అక్కడి గిరిజనులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఇక ఈ గిరిజన గ్రామాల ప్రజలను బలవంతంగా అక్కడి నుంచి తరలించడాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

108 గ్రామాలకు చెందిన వేలాది మంది ఆదివాసీలు అధౌరా అటవీ శాఖ కార్యాలయం ముందు సెప్టెంబరు 10న శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని పేర్కొంది. విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి, ఏడుగురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు నివేదిక ఆరోపించింది. దీనికి నిరసనగా ఆ గ్రామాల వారు ఎన్నికలను బహిష్కరించారు.
Tags:    

Similar News