ఫోర్బ్స్ జాబితాలో మ‌నోళ్లు దున్నేశారు!

Update: 2017-05-15 17:56 GMT
ప్రపంచంలోని వంద మంది అత్యుత్తమ వెంచర్ క్యాపిటలిస్టుల వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 11 మంది భారతీయ సంతతి అమెరికన్లకు చోటు దక్కింది. ది మిడాస్-2017 పేరుతో రూపొందించిన ఈ లిస్టులో.. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులపై సాధించిన రిటర్నుల విలువ ఆధారంగా వెంచర్ క్యాపిటలిస్టులకు ర్యాంకింగ్ ఇచ్చింది. సికోయా క్యాపిటల్‌లో భాగస్వామి అయిన జిమ్ గోయెట్జ్.. ఈసారి లిస్టులో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఆయన ఇన్వెస్ట్ చేసిన 6 కోట్ల డాలర్ల విలువ ఇప్పుడు 300 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంది.

భారతీయ సంతతి వ్యక్తుల విషయానికొస్తే.. బ్యాటరీ వెంచర్స్‌లో జనరల్ పార్ట్‌నర్ అయిన నీరజ్ అగర్వాల్‌కు ఈ లిస్టులో 17వ స్థానం లభించింది. యాక్సెస్ పార్ట్‌నర్స్ భాగస్వామి సమీర్ గాంధీకి 23వ స్థానం, గ్రేలాక్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామి అషీమ్ చందనకు 28వ స్థానం, బెయిన్ క్యాపిటల్ వెంచర్స్ ఎండీ సలీల్ దేశ్‌పాండేకు 33వ స్థానం, వర్క్‌డే సహ వ్యవస్థాపకులు, సీఈవో అనీల్ భుష్రీకి 37వ స్థానం దక్కింది. వింగ్ వెంచర్ క్యాపిటల్ వ్యవస్థాపక భాగస్వామి గౌరవ్ గార్గ్ 48వ స్థానంలో నిలిచారు. నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్ సీనియర్ మేనేజింగ్ పార్ట్‌నర్ ప్రమోద్ హాక్ (67వ స్థానం), జనరల్ కాటలిస్ట్ పార్ట్‌నర్స్ ఎండీ హేమంత్ తనేజా (70), మేఫీల్డ్ ఫండ్ ఎండీ నవీన్ చద్దా (73), లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామి రవి మాత్రే (76), ఇన్‌సైట్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎండీ దేవేన్ పరేఖ్‌కు (99) సైతం ఈ లిస్టులో స్థానం లభించింది.

నీరజ్ అగర్వాల్‌కు ఈ జాబితాలో చోటు దక్కడం వరుసగా ఇది ఏడోసారి. ఆయనకు చెందిన రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూపా, న్యుటానిక్స్ గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. మరో సంస్థ యాప్‌డైనమిక్స్ కూడా ఈ ఏడాది తొలినాళ్లలో పబ్లిక్ ఆఫరింగ్‌కు (ఐపీవో) రావాల్సింది. కానీ అంతకుముందే టెక్నాలజీ దిగ్గజం సిస్కో.. ఆ కంపెనీని 370 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
Tags:    

Similar News