అమెరికాలో కరోనా విస్ఫోటనం: ఒక్కరోజులో 11 లక్షల మందికి పాజిటివ్

Update: 2022-01-11 07:53 GMT
కోవిడ్-19 ఉధృతి ఇప్పటికీ తగ్గడం లేదు. రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. యూరప్ దేశాలు, అమెరికాను గుప్పిటపట్టి వేధిస్తోంది. నూతన సంవత్సరం మొదటి నెలలో మిలియన్ల మంది అమెరికన్ల రోజువారీ జీవితాన్ని కరోనా మార్చేసిందని అక్కడి మీడియా నివేదించింది.

అమెరికాలో కరోనా విస్ఫోటనం కొనసాగుతోంది. మొన్నటివరకూ రోజుకు 10లక్షల కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య మరో లక్ష పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 11 లక్షలకు చేరింది. రికార్డు స్థాయిలో కోవిడ్-19 బారిన పడి ఆస్పత్రుల బాట పడుతున్నారు. తాజాగా  11 లక్షల  పాజిటివ్‌ కేసులు ఒక్కరోజులో నమోదై అమెరికా రికార్డు సృష్టించింది.

రాయిటర్స్ ప్రకారం.. అమెరికాలో కోవిడ్19 బారినపడి ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య సోమవారం రికార్డు స్థాయిలో 1,32,646కి చేరుకుంది. యునైటెడ్ స్టేట్స్ సోమవారం కనీసం 11.3 లక్షల కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులను నివేదించింది, ఇది ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అత్యధిక రోజువారీ మొత్తం కావడం గమనార్హం. ఇన్ని కేసులతో అమెరికాలో కరోనా విస్ఫోటనం కలిగిందని చెప్పొచ్చు.

డిసెంబర్ చివరి నుంచి అమెరికాలో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మూడు వారాల్లో రెట్టింపు అయ్యింది. కొత్త కేసుల కోసం ఏడు రోజుల సగటు గత 10 రోజుల్లో రెండింతలు పెరిగి 704,000కి చేరుకుంది. రాయిటర్స్ లెక్క ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ వరుసగా గత ఆరు రోజులుగా సగటున అర మిలియన్ కేసులు నమోదయ్యాయి.  మరణాలు రోజుకు సగటున 1,700గా ఉన్నాయి. ఇది ఇటీవలి రోజుల్లో 1,400 నుంచి పెరిగింది, అయితే ఈ చలికాలం ప్రారంభంలో చూసిన స్థాయిల్లోనే కావడం గమనార్హం.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తాజా డేటా ప్రకారం, గత వారంలో యుఎస్ అంతటా పిల్లలు  కోవిడ్ ఆసుపత్రిలో చేరడం 58 శాతం పెరిగింది. అమెరికాలో సగటున రోజుకు 260 పీడియాట్రిక్ కేసులు కోవిడ్-19 ఆసుపత్రిలో చేరుతున్నారు. ఒక వారంలో దాదాపు 30 శాతం పెరిగింది, డిసెంబర్ 21-డిసెంబర్ 27 నుంచి ఆ డేటా నమోదైంది.   పిల్లలతో సహా అన్ని వయసుల వారికి టీకాలు వేయని వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు.
Tags:    

Similar News