తెలంగాణ అసెంబ్లీలో 11 మందిపై సస్పెన్షన్

Update: 2016-12-17 09:33 GMT
తొలిరోజు కాస్తంత సాఫీగా జరిగినట్లు కనిపించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరుతూ విపక్షాలు పట్టుబట్టాయి. అదే సమయంలో స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల్ని చేపట్టారు. వాయిదా తీర్మానంపై చర్చ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు.

దీనిపై తెలంగాణ శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. విలువైన సభా సమయాన్ని విపక్ష సభ్యులు వృధా చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరుపుతున్నప్పుడు సభను అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్న హరీశ్.. సభ్యులు ఎంత చెబుతున్నా వినకుండా తమ నిరసననుకొనసాగిస్తున్న నేపథ్యంలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేస్తూ తీర్మారాన్ని ప్రవేశ పెట్టారు.

దీనికి స్పీకర్ ఆమోద ముద్ర వేయటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ.. మల్లు భట్టివిక్రమార్క.. సంపత్ కుమార్.. గీతారెడ్డి.. చిన్నారెడ్డి.. వంశీచందర్ రెడ్డి.. రాం మోహన్ రెడ్డి.. పద్మావతి రెడ్డి.. జీవన్ రెడ్డిలపై ఒక రోజు సస్పెన్షన్ వేటువేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సైతం ఒక రోజు సస్పెండ్ చేశారు.

పార్టీ ఫిరాయింపుపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేసిన సభ్యులను సస్పెండ్ చేయటం సరికాదన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి.. చట్టాలను సంరక్షించాల్సిన బాధ్యత సభపై ఉందన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ఫిరాయింపుల అంశం తమ పరిశీలనలో ఉందన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే వరకూ సభ్యులు వెయిట్ చేస్తే బాగుంటుందన్న స్పీకర్.. సభను అడ్డుకునేలా సభ్యులు వ్యవహరించిన నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం సభలో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయటం దారుణమన్న ఆయన.. సభలో ఇలాంటి పరిస్థితి తానెప్పుడూ చూడలేదని.. తెలంగాణ అధికారపక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై చర్చ జరుపుతామని స్పీకర్ స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదని.. అంతేకానీ సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయటం సరికాదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి హరీశ్.. ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అన్నందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారంటూ పాత విషయాల్ని గుర్తు చేశారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న జానారెడ్డి మాట్లాడలేదన్న హరీశ్.. సభను అడ్డుకోవటం సరికాదన్నారు. తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జానారెడ్డి.. సభ నుంచి వాకౌట్ చేసి తన నిరసనను వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News