మోడీపై కేసీఆర్ మార్క్ 'స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్'!

Update: 2019-03-30 05:43 GMT
ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇద్ద‌రూ  ఒకే తానులో ముక్క‌లుగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. బాగున్న‌ప్పుడు ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేయ‌టం.. తేడా వ‌చ్చిన‌ప్పుడు పాతాళానికి తొక్కేలా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌టం ఇద్ద‌రికి అల‌వాటే. అంతేకాదు.. ఇద్ద‌రి మైండ్ సెట్ ఇంచుమించు ఒకేలా ఉంటుంద‌ని చెబుతారు. ఏ విష‌యం పైనైనా హైప్ క్రియేట్ చేసుకోవ‌టంలో ఇరువురూ మొన‌గాళ్లే.

పార్టీని.. ప్ర‌భుత్వాన్ని న‌డిపే విష‌యంలోనూ.. ప్ర‌త్య‌ర్థుల్ని అణ‌గ‌దొక్కే వారి విష‌యంలోనూ.. త‌మ ద‌గ్గ‌ర త‌ల ఎగుర‌వేసే వారి విష‌యంలోనూ కాదు.. వ్య‌వ‌స్థ‌లను కంట్రోల్ చేసే తీరు కూడా ఇద్ద‌రి స్టైల్ ఒకేలా ఉంటుంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అన్ని బాగున్న‌ప్పుడు మోడీని ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్‌.. అదే రీతిలో కేసీఆర్ కు కితాబుల మీద కితాబులు ఇవ్వ‌ట‌మే కాదు.. పార్ల‌మెంటులోనూ పొగిడేసి వైనాన్ని మ‌ర్చిపోలేం. ఇలా సాగుతున్న వీరిద్ద‌రి బంధం ఎన్నిక‌ల వేళ‌.. ఇరువురు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మోడీకి ర‌హ‌స్య మిత్రుల జాబితాలో కేసీఆర్ ఉంటార‌న్న వాద‌న బ‌లంగా వినిపించినా.. వారిద్ద‌రి మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల సంవాదం మాత్రం ఒక స్థాయిలో ఉంద‌ని చెప్పాలి. తాజాగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ కేసీఆర్ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు చేస్తే.. అందుకు ప్ర‌తిగా కేసీఆర్ తానేమీ త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మోడీ గొప్ప‌గా చెప్పుకునే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ గురించి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. స‌ర్జిక‌ల్ స్ట్రైక్ పేరుతో బీజేపీ నీచ రాజ‌కీయం చేస్తుంద‌న్న కేసీఆర్‌.. మోడీ ఐదేళ్ల పాల‌న‌లో దేశానికి ఏమీ జ‌ర‌గ‌లేద‌న్నారు.

సారు..కారు.. ప‌ద‌హారు.. ఆపై ప్ర‌ధాని అన్న‌ట్లు సాగుతున్న ప్ర‌చారానికి త‌గ్గ‌ట్లే..కేసీఆర్ ప్ర‌ధాని పీఠాన్ని చేజిక్కించుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లు చెబుతున్నారు. మాట‌లు చెప్పినంత ఈజీగా ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్ట‌టం అంత ఈజీ కాదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాని ప‌ద‌వికి కేసీఆర్ అంటూ గులాబీ ద‌ళం సాగిస్తున్న ప్ర‌చారంతో అయినా తాము టార్గెట్ చేసిన ప‌ద‌హారు సీట్లను సొంతం చేసుకోగ‌ల‌మ‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు.

న‌ల్గొండ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పైనా.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. జాతీయ అంశాల‌తో పాటు.. అంత‌ర్జాతీయ అంశాల్ని ప్ర‌స్తావించిన కేసీఆర్ మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇటీవ‌ల భార‌త్ జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ లో 300 మంది తీవ్ర‌వాదులు చ‌నిపోయిన‌ట్లుగా భార‌త్ చెబుతుంటే.. చీమ కూడా చావ‌లేద‌ని మ‌సూద్ అజార్ అన్న విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించ‌టం.. మోడీని విమ‌ర్శించే ధోర‌ణితో ఆయ‌న వ్యాఖ్య‌లు ఉండ‌టం విశేషం.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మీద విమ‌ర్శ‌లు చేసే వారిని దేశ‌ద్రోహుల‌న్న‌ట్లుగా క‌మ‌ల‌నాథులు చేసే దాడి.. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మీద చేసే నెగిటివ్ వ్యాఖ్య‌ల‌న్ని ర‌క్ష‌ణ ద‌ళాల పోరాటాన్ని త‌క్కువ చేసిన‌ట్లుగా ఉంటుందంటూ బీజేపీ వ‌ర్గాలు వినిపించే వాద‌న‌ను లైట్ తీసుకుంటూ మోడీపై మెరుపుదాడి త‌ర‌హాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ హాట్ గా మారాయి.

మోడీపై కేసీఆర్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చూస్తే..

+  సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ను రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ప్రధాని మోదీ - బీజేపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నేను కేబినెట్‌ మంత్రిగా ఉన్నా. అప్పుడు కూడా 11 సార్లు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగాయి.

+  సాధారణంగా సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసిన విషయాన్ని బయటకు చెప్పరు. ఎందుకంటే అవి వ్యూహాత్మక దాడులు. కానీ, ఇవాళ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ లో ఒక్క దెబ్బకు 300 మంది చచ్చిపోయారని ప్రధాని మోదీ డొల్ల ప్రచారం చేసుకుంటున్నడు. మసూద్‌ అజార్‌ ఏమో చీమ కూడా చావలేదని అంటున్నాడు. ఇదేం ప్రచారం!?

+  స్ట్రయిక్స్‌ ఫొటోలు చూపించి ప్రచారం చేసుకుంటారా? ఇదేనా మీ పాలన? దేశాన్ని నడిపించేది ఇలానేనా?’’

+  మొన్నటిదాకా ఛాయ్‌ వాలా అని.. ఇవాళ కొత్తగా చౌకీదారు అని పేరు పెట్టుకున్న మోదీ - ఆయ‌న వ‌ర్గం వారు మైకులు ప‌గిలేలా అరుస్తున్నారు.
Tags:    

Similar News