లాక్‌ డౌన్ ముగిస్తే 12గంట‌లు ప‌ని చేయాల్సిందే..!

Update: 2020-04-12 06:52 GMT
కరోనా వైరస్ క‌ట్ట‌డి కోసం ఇప్ప‌టికే 21 రోజులు ముగుస్తుండ‌గా తాజాగా పొడిగించే అవ‌కాశం ఉంది. అంటే ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. వారిలో ప్ర‌భుత్వ ఉద్యోగులు - కార్మికులు కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. అయితే ఇన్నాళ్ల‌పాటు విధుల‌కు రాకుండా ఉద్యోగులు - కార్మికులు ఉండ‌డం.. కంపెనీలో ఉత్ప‌త్తి త‌గ్గిపోవ‌డం.. సేవ‌లు ఆగిపోవ‌డంతో ప్ర‌భుత్వం తిరిగి గాడీలో ప‌డేలా ఇప్ప‌టి నుంచే స‌మాలోచ‌న‌లు చేస్తోంది. లాక్‌ డౌన్ ముగిసిన అనంత‌రం ఏ విధంగా కంపెనీ - సంస్థ‌లు తిరిగి పుంజుకుని పూర్వ‌స్థాయికి ఏం చేయాలో ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రానికి 1948 నాటి చ‌ట్టం గుర్తుకు వ‌చ్చింది. ఆ చ‌ట్టం లాక్‌ డౌన్ ముగిసిన అమ‌లు చేస్తే కొంత ప్ర‌యోజ‌నం ఉంటుందని భావిస్తున్నారంట‌. ఆ చ‌ట్టం తెస్తే ఏమ‌వుతుంది? ఆ చ‌ట్టంలో ఏముందంటే..

1948 చట్టంలో ఉద్యోగులు - కార్మికులు 12 గంట‌లు ప‌ని చేయాల‌నే నిబంధ‌న ఉందిజ. లాక్‌ డౌన్ ముగియ‌గానే ఆ చ‌ట్టం అమ‌లుచేస్తే దాని ప్రకారం ఉద్యోగులు - కార్మికులు రోజుకి 12 గంటల పాటు పరిశ్రమల్లో పని చేయాల్సి ఉంది. అయితే దీన్ని రెండు షిఫ్టుల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. లాక్‌ డౌన్‌ తో ఆగిపోయిన ఉత్పత్తులు - సేవ‌లు ఆగిపోయిన నేప‌థ్యంలో తిరిగి పుంజుకునేలా ఆ చట్టం దోహ‌దం చేస్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కార్మిక చ‌ట్టాల్లో 8 గంటల చొప్పున వారంలో 48 గంటలకు మించి ఎవరినీ పని చేయించరాదనే నిబంధనలు ఉన్నాయి. అయితే అత్యావసర సమయాల్లో పని గంటలను వారానికి 72 గంటలు పొడిగించవచ్చనే నిబంధ‌న కూడా ఉంది. దీంతో దీన్ని ఆస‌రాగా చేసుకుని కేంద్ర ఆ చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తెచ్చి పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు.. పనివేళలను పెంచనున్నారంట‌.

అయితే దీనిపై 11 మంది సీనియర్ అధికారుల సాధికార కమిటీ ఫ్యాక్టరీల చట్టానికి సవరణల సూచించింది. ఔషధాల సరఫరా కూడా సరిగా లేకపోవడంతో ఫ్యాక్టరీల చట్టానికి తాత్కాలికంగా సవరణలను చేయడమనే ఉత్తమమని అధికారుల బృందం తెలిపింద‌ని స‌మాచారం. అలాంటి ప‌ని చేసే వారికి అదనపు వేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంది. దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు పౌరులు బాధ్య‌త‌గా ప‌ని చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పి ఉద్యోగులతో అద‌నంగా ప‌ని చేయించుకునే అవ‌కాశం ఉంది.


Tags:    

Similar News