పొద్దున్నే ఘోరం..కాల్వ‌లో ట్రాక్ట‌ర్‌..12 మంది మృతి?

Update: 2018-04-06 04:45 GMT
పొద్దు పొద్దున్నే ఘోరం జ‌రిగిపోయింది. దారుణ‌మైన ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌నుల కోసం వెళుతున్న ట్రాక్ట‌ర్ అదుపు త‌ప్పి ఏఎంఆర్పీ కాల్వ‌లో ప‌డిన ఘ‌ట‌న‌లో 12మంది ప్రాణాలు పోగొట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘోర ప్ర‌మాదంలో 10 మంది మ‌ర‌ణించిన‌ట్లు కొన్ని మీడియా సంస్థ‌లు చెబుతుంటే.. మ‌రికొన్ని మీడియా సంస్థ‌లు 12గా చెబుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన తీరు చూస్తే.. మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది.

ఇంత‌కీ ఈ దారుణ ఘ‌ట‌న ఎక్క‌డ చోటు చేసుకుందంటే.. న‌ల్గొండ జిల్లా పీఏప‌ల్లి మండ‌లం ఒద్దిప‌ట్ల ప‌డ‌మ‌టి తండాలో. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఒద్దిప‌ట్ల నుంచి పులిచ‌ర్ల‌లోని మిర‌ప‌చేనులో కూలీ ప‌నుల కోసం 30 మంది వ్య‌వ‌సాయ కూలీల‌తో ట్రాక్ట‌ర్ బ‌య‌లుదేరింది.

ఏఎం ఆర్పీ కాల్వ వ‌ద్ద‌కు ట్రాక్ట‌ర్ చేరుకునే స‌రికి.. అదుపు కాల్వ‌లో త‌ప్పింది. ఈ ప్ర‌మాదాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే ప్ర‌మాదం జ‌రిగిన చోటుకు చేరుకొని ప‌లువురిని ర‌క్షించారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెను వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇప్ప‌టివ‌ర‌కూ 12 మంది మృతుల‌ను గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రికొంద‌రుమాత్రం 10 మందినే గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంద‌ని చెబుతున్నారు. కాల్వ‌లో ప‌డి గ‌ల్లంతైన వారిలో ప‌లువురు చిన్నారులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్ర‌మాదం గురించి విన్న వారంతా కంట‌త‌డి పెట్టేలా ఉంది. కాల్వ‌లో నీటి ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత పెరిగిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌ల్లంతైన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
Tags:    

Similar News