అన్న ట్యాబ్ లాక్కున్నాడని.. తమ్ముడు సూసైడ్

Update: 2020-03-01 04:37 GMT
విన్నంతనే వణికే పరిస్థితి. మానసిక పరిణితి పెద్దగా లేని చిన్నారుల్లోనూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అసలు అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందన్న ప్రశ్నతో పాటు.. పిల్లల పెంపకంలో కొత్తగా ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉందా? అన్న సందేహం తలెత్తేలా తాజా ఉదంతం ఉందని చెప్పాలి.

ఇంట్లో ఏదైనా వస్తువ కోసం అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు.. అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు పోట్లాడుకోవటం చాలా కామన్. కానీ.. అలా మొదలైన పోట్లాట.. చివరకు ప్రాణాలు తీసుకునే వరకూ వెళుతుందన్నది ఊహకు అందని అంశంగా చెప్పక తప్పదు. మియాపూర్ లో తాజాగా చోటు చేసుకున్న విషాద ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. తల్లిదండ్రులకు కొత్త ధర్మసందేహాలకు గురయ్యేలా చేసిందని చెప్పాలి.

గుంటూరుజిల్లా నర్సరావుపేటకు చెందిన శ్రీనివాస్.. మల్లేశ్వరి దంపతులు. వారు మదీనాగూడలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. వారికి నందకిశోర్.. సత్యప్రసాద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్య ప్రసాద్ చిన్నోడు. అతగాడు ఆరో తరగతి చదువుతున్నాడు. కొండాపూర్ లోని ఒక స్కూల్లో చదువుతున్నాడు.

శనివారం అన్నదమ్ములు ఇద్దరు ట్యాబ్ కోసం గొడవ పడ్డారు. అప్పటికే తమ్ముడి చేతిలో ఉన్న ట్యాబ్ తనకు ఇవ్వాలని అన్న కోరాడు. ఇందుకు తమ్ముడు ససేమిరా అన్నాడు. ఇలా వారి మధ్య వాదులాట సాగుతున్న వేళ.. కాసేపు అన్నకు ఇవ్వొచ్చుగా అంటూ చిన్న కొడుకు చేతిలో ఉన్న ట్యాబ్ ను తీసుకొని పెద్దకొడుక్కి ఇచ్చాడు. అంతే.. మనస్తాపానికి గురైన చిన్నపిల్లాడు ఏడ్చుకుంటూ అపార్ట్ మెంట్ పై అంతస్తులోకి వెళ్లి.. క్షణికావేశంలో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతంలో షాక్ తిన్నారు పిల్లాడి తల్లిదండ్రులు. తీవ్ర గాయాలపాలైన కొడుకును ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తేల్చారు. ఎంత ట్యాబ్ కోసం గొడవ అయితే మాత్రం..దానికే ప్రాణాలు తీసుకుంటారా? అన్న ప్రశ్న ఇప్పుడు పలువురిని వేధించటంతో పాటు..ఇప్పటి తరం పిల్లల మానసిక తీరుపై కొత్త భయాందోళనలు కలిగించేలా చేస్తోంది.


Tags:    

Similar News