అమరావతికి 33 వేల ఎకరాలు వద్దు.. ఇప్పటం రోడ్డు మాత్రం 120 అడుగులు? ఉండాలా?

Update: 2022-11-07 11:30 GMT
దేనికైనా న్యాయం ఒక్కటే ఉండాలి కదా? ఒకదానికి ఒక వాదన.. అలాంటి ఇష్యూకే మరోలాంటి వాదన వినిపించటంలో అర్థం ఏమిటి? అన్నది ప్రశ్న. రెండు.. మూడు రోజుల క్రితం వరకు "ఇప్పటం" అన్న పేరు వింటే.. ఏమిటిది? అన్న ప్రశ్న వచ్చేది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుణ్యమా అని ఇప్పుడా ఊరు పేరు మారుమోగుతోంది. ఏపీలోని జగన్ సర్కారు తలుచుకోవాలే కానీ.. ఏమైనా జరుగుతుందన్న దానికి నిదర్శనంగా ఈ చిన్న ఊరు నిలిచింది.

ఇప్పటం గ్రామానికి ఆర్టీసీ బస్సు కూడా లేదు. కానీ.. ఇక్కడి రోడ్లను 120 అడుగుల మేర వెడెల్పు చేయటానికి అధికారులు ప్రదర్శించే ఉత్సాహాన్ని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. ఎందుకంటే.. ఏ ప్రభుత్వమైతే.. తన రాష్ట్ర రాజధాని నగరాన్ని 33 వేల ఎకరాల్లో నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సు సర్వీసు కూడా లేని గ్రామంలో మాత్రం రోడ్ల వెడల్పు 120 అడుగుల ఎందుకు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి.

ఏదో.. పది బిల్డింగులు కట్టేసి.. రాజధాని నగరం అని తేల్చేసే దానికి.. వేలాది ఎకరాలు ఎందుకు తీసుకోవాలి? దానికి ఒక ప్రణాళికను ఎందుకుసిద్ధం చేయాలి? మిగిలిన రాష్ట్రాల రాజధానుల్లో తరచూ కనిపించే మౌలిక సదుపాయాల కొరత ఏపీ రాజధానికి కలగకూడదన్న ఉద్దేశంతో భారీగా ప్లాన్ చేయటాన్ని ఎటకారం చేసేటోళ్లకు.. ఇప్పటం లాంటి చిన్న ఊరికి 120 అడుగుల రోడ్డు అవసరమా? దాని కోసం ఇంత రచ్చ చేయటమా? అన్న ప్రశ్నలకు సమాధానం ఏమిటి?

ఇప్పటంలో ఆ మధ్యన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ప్లీనరీని నిర్వహించిన నాటి నుంచి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన ఈ చిన్న గ్రామానికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయని చెబుతున్నారు. అన్నింటికి మించి.. ఈ చిన్న గ్రామంలో రెండు.. మూడు రోజుల క్రితం అక్రమ కట్టడాల పేరుతో నిర్మాణాల్ని కూల్చేసిన వైనం సంచలనంగా మారింది.

బాధితులు వద్దన్నా వినిపించుకోకుండా ఇళ్ల ప్రహరీలను.. షాపుల్ని నేలమట్టం చేసేశారు. దీన్ని నిరసిస్తూ పవన్ కల్యాణ్ చేపట్టిన పర్యటన పెద్ద ఎత్తున మైలేజీ పెరగటమే కాదు.. సమస్యలు ఎదురైనప్పుడు తాను ఉన్నానన్న భరోసాతో పాటు.. తాను దేనికైనా సిద్ధమన్న సంకేతాన్ని తాజా పరిణామాల్లో స్పష్టం చేయటం తెలిసిందే.

ఇప్పటంలో అధికారులు కూల్చిన వాటిల్లో ఇళ్లు లేవని.. అన్ని ఇంటి ప్రహరీ గోడలే అంటూ కొత్త తరహా ప్రచారాన్ని షురూ చేశారు. కూల్చేసిన వాటిల్లో షాపులే కాదు.. జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహంతో పాటు.. మరోప్రముఖుడి విగ్రహాన్ని కూల్చేసి.. రోడ్డు మీద ఉన్న వైఎస్ విగ్రహాన్ని మాత్రం టచ్ చేయలేదు. పనిలో పనిగా శివాలయంలో నందీశ్వరుడ్ని సైతం నేలమట్టం చేశారు. ఇన్ని చేసి కూడా.. ఇప్పటం అనే చిన్న ఊరి డెవలప్ మెంట్ కోసమని విశాలమైన రహదారుల కోసం ప్రభుత్వం నిబద్ధతతో ఉంటే.. కుట్ర పూరితంగా ప్రచారాల్ని నిర్వహిస్తారా? అని ప్రశ్నిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇప్పటం లాంటి ఊరికే ఇంత భారీగా రోడ్లు అవసరమని భావించినప్పుడు.. ఏపీ రాజధాని అమరాతిని 33 వేల ఎకరాల్లో నిర్మించాల్సిన అవసరం ఏమిటన్న వాదనలో తొండి ఇట్టే కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News