పళని ఫుల్ జోష్‌ లోకి వ‌చ్చేశాడుగా

Update: 2017-09-06 06:57 GMT

త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీలో కీల‌క ప‌రిణామం. అన్నాడీఎంకేలోని రెండు కీల‌క‌వ‌ర్గాలైన ప‌ళ‌నిస్వామి - ప‌న్నీర్ సెల్వం సార‌థ్యంలోని ప్రభుత్వం మైనారిటీలో పడిందని - బలనిరూపణ కో సం అసెంబ్లీని సమావేశ పర్చాలని తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. చెన్నైలోని ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం పళనిస్వామి నిర్వహించిన సమావేశానికి 111 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆగస్టు 28న నిర్వహించిన సమావేశానికి కేవలం 75 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా - తాజాగా నిర్వహించిన సమావేశానికి 111 మంది హాజరుకావడంతో సీఎం పళనిస్వామి ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా ఫుల్ జోష్‌ తో క‌నిపించారు.

ఈ ఉత్సాహ‌వంత‌మైన సమావేశం అనంతరం రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి - ఏఐఏడీఎంకే సీనియర్ నేత డీ జయకుమార్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వానికి మొత్తం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. పళనిస్వామికి తమ పూర్తి మద్దతు - సహకారం తెలియజేస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారని పేర్కొన్నారు. దినకరన్ శిబిరంలోని తొమ్మిది మంది ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి పళనిస్వామితో ఫోన్‌ లో టచ్‌ లో ఉన్నారని, వారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. మిత్రపక్షాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పళనిస్వామికి మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

మ‌రోవైపు స్పీకర్ ఎదుట హాజరుకావడానికి తమకు మరో 15 రోజుల సమయం కావాలని దినకరన్ వర్గ ఎమ్మెలేలు కోరారు. కొన్ని అంశాల్లో తమకు వివరణలు రావాల్సి ఉన్నందుకు ఈ మేరకు గడువు ఇవ్వాలని తమ ప్రతినిధులతో స్పీకర్ కార్యాలయానికి సమాచారం తెలియజేశారు. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు సెప్టెంబర్ ఏడో తేదీన తన ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని - లేనిపక్షంలో అనర్హులుగా ప్రకటిస్తానని ఆగస్టు 24న అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News