క‌ర్ణాట‌క‌లో విషాదం.. భ‌గ‌త్ సింగ్ ఉరి స‌న్నివేశం రిహార్సల్సే కార‌ణం!

Update: 2022-11-01 02:30 GMT
నాట‌కాలు చారిత్ర‌క నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌డ‌తాయి. అందునా విద్యార్థి ద‌శ‌లో నాట‌కాలు వేస్తే ఆ ప్రోత్సాహం, ఆ గుర్తింపు వేరేగా ఉంటుంది. అందుకే, క‌ర్ణాట‌క‌లో న‌వంబ‌రు 1న నిర్వ‌హించే `క‌ర్ణాట‌క రాజ్యోత్స‌వ‌`లో విద్యార్థుల‌కు కొన్ని అవ‌కాశాలు క‌ల్పించారు. ఈ క్ర‌మంలో `భ‌గ‌త్‌సింగ్` జీవితంలోని కీల‌క‌మైన ఘ‌ట్టాన్ని నాట‌కంగా వేయాల‌ని విద్యార్థులు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఉరి స‌న్నివేశాన్ని ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థి.. మెడ‌కు ఉరి బిగుసుకుని మృతి చెందాడు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్రంలో విషాదం నెల‌కొంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం, స్థానిక ఎస్‌ఎల్‌వీ పాఠశాలలో 12 ఏళ్ల  సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా కళాశాలలో భగత్ సింగ్ నాటకం వేయాల్సి ఉంది. ఇందులో భగత్ సింగ్ పాత్రను అతనికి అప్పగించారు. ఇందుకోసం ఇంట్లో రిహార్సల్స్ చేస్తున్నాడు. అయితే..  ప్రమాదవశాత్తూ అతను మరణించాడు. ఇంట్లో పెద్ద వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

''నాటకం రిహార్సల్స్ కోసం రూములో ఒక తాడును ఫ్యానుకు కట్టినట్టు కనిపిస్తోంది. ఉలెన్ క్యాప్‌ను తలకు తొడుక్కుని, మెడ చుట్టూ ఉచ్చు వేసుకున్నాడు. మంచం మీద నుంచి కిందకు దూకడంతో నిమిషాల్లోనే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినట్టు కనిపిస్తోంది'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తల్లిందండ్రులు విగత జీవుడుగా తమ పిల్లవాడు కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, భగత్ సింగ్ నాటకం కోసం అదేరోజు పాఠశాలలో కూడా పిల్లలు రిహార్సల్స్ వేశారని, అయితే స్టూల్ ఉపయోగించలేదని అదే స్కూలులో తన కుమారుడిని కూడా చదివిస్తున్న సుందర్ రాజ్ తెలిపాడు. గౌడ చాలా ఫ్రెండ్లీగా, ఎంతో చురుకుగా ఉండేవాడని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌తో క‌ర్ణాట‌క‌లో విషాదం నెల‌కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News