గల్లంతైన వారిలో ఆ 13 మంది ఎక్కడ? ఏమైనట్లు?

Update: 2019-09-19 06:05 GMT
గోదావరి నదిలో కచ్చలూరి వద్ద చోటు చేసుకున్న బోటు ప్రమాదం ఇప్పుడో పెద్ద చిక్కును తెచ్చి పెట్టింది. దాదాపు 200 అడుగుల లోతులోకి మునిగిన బోటును బయటకు తీయటం ఇప్పుడో సమస్యగా మారింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిపుణులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి.. అక్కడి ప్రతికూల పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మునిగిన బోటును బయటకు తీయటం ఒక ఎత్తు అయితే.. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇప్పటికి ఆచూకీ లభించని వారి పరిస్థితి ఏమిటి? అన్నది మరో ప్రశ్నగా మారింది.

అధికారుల లెక్క ప్రకారం బోటులో మొత్తం 73 మంది ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అందులో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 47 మందిలో ఇప్పటివరకూ 34 మంది మరణించినట్లుగా గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో వారి డెడ్ బాడీలు లభించాయి. ఇక.. మిగిలిన 13 మంది ఆచూకీ నేటికి లభించలేదు. ప్రమాదం చోటు చేసుకొని నాలుగో రోజులోకి వచ్చినా.. మిస్ అయిన వారి ఆచూకీ లభించకపోవటంతో.. వారు ప్రాణాలతో ఉంటారా? అన్నది సందేహంగా మారింది.

రోజురోజుకి దొరుకుతున్న మృతదేహాలతో గల్లంతైన వారిలో ఎక్కువమంది మరణించి ఉంటారన్న అభిప్రాయానికి వస్తున్నారు. అలా అని.. ఆశలు వదులుకోలేక.. గల్లంతైన వారి జాడ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మిస్ అయిన వారిలో కొంతమంది బోటులోనే చిక్కుకుపోయి ఉంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. బోటులోకి వెళ్లటం కష్టంగా మారటం ప్రతికూలంగా మారింది. అందుకే.. బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. అది కష్టంగా మారటంతో.. కనీసం బోటు లోపలకు వెళ్లి.. పరిశీలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా నిపుణుల్ని రంగంలోకి దించారు. అయితే.. బోటు మునిగిన ప్రాంతంలో బురద ఎక్కువగా ఉండటం.. నీటి వడి సమస్యగా మారినట్లు చెబుతున్నారు.

లోతైన ప్రాంతాల్లో మునిగిన బోట్లను గతంలో బయటకు తీసినా.. అక్కడి పరిస్థితులకు కచ్చలూరి దగ్గర పరిస్థితులకు సంబంధం లేదని.. అదే బోటును బయటకు తీయటానికి ప్రతికూలంగా మారిందంటున్నారు. బోటులోని గదిలో విశ్రాంతి తీసుకుంటున్న వారు.. ప్రమాదం జరిగినప్పుడు.. ఆయా గదుల్లోనే చిక్కుకుపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గల్లంతైన వారందరి ఆచూకీ లభిస్తే.. బోటును బయటకు తీసే ప్రయత్నాన్ని ఆపేయాలని అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మిస్ అయిన 13 మంది ఆచూకీ లభించే వరకూ వెతుకులాటను అధికారులు ఆపాలనుకోవటం లేదంటున్నారు.


Tags:    

Similar News