అమెరికాలో అగ్గి రాజుకునే ఘటన జరిగింది

Update: 2016-08-12 07:22 GMT
ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. సబ్బులు కొన్నంత ఈజీగా తుపాకీలు కొనుగోలు చేసే వెసులుబాటు ఆ దేశంలో ఉంటుంది. ఈ సౌలభ్యం సౌకర్యంగా కాకుండా ఆ దేశానికో సమస్యగా మారిన విషయం తెలిసిందే. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారి చేతుల్లోకి వస్తున్న గన్స్ కారణంగా అమెరికాలో ఎప్పుడు ఎలాంటి దారుణ ఘటన జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యన నల్లజాతీయులపై అమెరికా పోలీసులు అనుమానాస్పదంగా ఉన్నారంటూ కాల్చేయటం.. ఈ పరిణామం అనంతరం అమెరికా వ్యాప్తంగా నిరసనలు జోరందుకోవటంతో పాటు.. అమెరికన్ పోలీసులపైదాడులు జరిగే వరకూ వెళ్లటం తెలిసిందే. ఇలాంటి పరిణామం కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నా.. గతంలో అలాంటి చేదు అనుభవాలు అమెరికాకు తక్కువే.

తాజాగా పోలీసులు అత్యుత్సాహంతో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాస్ ఏంజెలిస్ లోని 14 ఏళ్ల బాలుడిపై పోలీసులు కాల్పులు జరిపి చంపేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక ఇంటి యజమాని తన ఇంటి పక్కన కాల్పులు జరుగుతున్నాయన్న సమాచారం అందించాడు. దీంతో.. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. అక్కడ గన్ తోకనిపించిన కుర్రాడి (బాలుడు)పై కాల్పులు జరిపారు. దీంతో.. ఆ బాలుడు మరణించాడు. ఈ ఘటనపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలీసుల చర్యల్ని తప్పు పడుతున్నారు. అయితే.. పోలీసుల వాదన మరోలా ఉంది. తమకు వచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చామని.. అక్కడ ఉన్న అతని చేతిలో తుపాకీ ఉండటం.. ఆ బాలుడ్ని 20 ఏళ్ల కుర్రాడిగా తాము భావించి కాల్పులు జరిపినట్లుగా వివరిస్తున్నాయి. పిల్లాడు అన్నది కూడా చూడకుండా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అమెరికాను ఎంతగా ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News