సైకిల్‌పై 15 ఏళ్ల బాలుడు.. వేల కిలోమీట‌ర్ల సాహ‌స‌యాత్ర‌!

Update: 2022-09-06 00:30 GMT
పిల్ల‌ల్ని ఒంట‌రిగా ఎక్క‌డికైనా పంపడానికి త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డ‌తారు. క‌నీసం ఫ్రెండు ఇంటికి వెళ్లి ఆడుకుని వ‌స్తానన్న పంప‌ని త‌ల్లిదండ్రులే అధికం. అయితే పిల్ల‌ల ఇష్టాఇష్టాల‌ను గౌర‌వించి.. వారిని ప్రోత్స‌హిస్తే అద్భుతాలు సాధించ‌గ‌ల‌ర‌ని చెన్నైకి చెందిన 15 ఏళ్ల బాలుడు నిరూపించాడు. ఏకంగా ద‌క్షిణ భార‌త‌దేశంలోని చెన్నై నుంచి ఉత్త‌ర భార‌త‌దేశంలో జ‌మ్ముక‌శ్మీర్‌లోని లేహ్‌కు చేరుకున్నాడు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా రాజంపేట‌కు చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపార రీత్యా కొన్నేళ్ల క్రితం చెన్నైకు వ‌ల‌స వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డింది. ఇటీవ‌ల ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన 15 ఏళ్ల ఆశిష్ త‌న సాహ‌స యాత్ర‌కు శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా సైకిలుపై చెన్నై నుంచి ల‌ద్ధాఖ్ రాజ‌ధాని లేహ్ వ‌ర‌కు ప‌ర్య‌టించాడు. స్లైకింగ్‌పై మంచి ఆస‌క్తి ఉన్న ఆశిష్ చెన్నై నుంచి 41 రోజుల్లోనే చెన్నై నుంచి లేహ్ చేరుకోవ‌డం విశేషం.

సైకిల్ పై త‌న సాహ‌స యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్‌ సహా అతడి కుటుంబ సభ్యులు ఏపీ భవన్‌లో మీడియాతో యాత్ర వివ‌రాలు పంచుకున్నారు. ఆశిష్‌ మాట్లాడుతూ  జూలై 18న త‌న సైకిల్ యాత్ర‌ను ప్రారంబించాన‌ని తెలిపాడు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, పంజాబ్, హ‌రియాణా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, జ‌మ్ముక‌శ్మీర్ మీదుగా ల‌ద్ధాఖ్, లేహ్ వ‌ర‌కు చేరుకున్నాన‌ని వివ‌రించాడు. ఆగ‌స్టు 27న త‌న యాత్ర ముగిసింద‌ని పేర్కొన్నాడు. ఇందుకు త‌న‌కు నామ‌మాత్రంగానే ఖ‌ర్చ అయ్యింద‌ని తెలిపాడు.

సైకిల్‌ యాత్రలో భాగంగా మైదాన ప్రాంతాల్లో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. పంజాబ్ లోని చండీఘడ్‌ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం ఇబ్బంది పెట్టాయ‌ని వెల్ల‌డించారు. వీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురైనా యాత్ర‌ను విజ‌యవంతంగా కొన‌సాగించాన‌ని తెలిపాడు,

కాగా నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో చేరి ఆర్మీలో చేరాల‌న్న‌దే త‌న క‌ల అని ఆశిష్ పేర్కొన్నాడు. త‌న త‌ల్లిదండ్రులు త‌న‌పై ఎప్పుడూ ఒత్తిడి పెట్ట‌లేద‌ని తెలిపాడు. త‌ల్లిదండ్రులు అంతా త‌మ పిల్ల‌ల‌ను ఏ విష‌యంలోనూ ఒత్తిడి చేయొద్ద‌ని.. వారి ఇష్టాఇష్టాల‌ను గౌర‌వించాల‌ని ఆశిష్ కోరుతున్నాడు. ఇదే విష‌యాన్ని త‌న సైకిల్ యాత్ర సాగిన ప‌లు ముఖ్య ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో స్కూళ్ల ముందు నుంచుని కోరాడు. త్వ‌ర‌లో చెన్నై నుంచి లండన్‌కు సైకిల్ యాత్ర చేయనున్నట్లు ఆశిష్ త‌న భావి ల‌క్ష్యాల‌న వివ‌రించాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News