2022లో 193 కోట్లు.. బీఆర్ఎస్ పార్టీపై ఎందుకింత ప్రేమ

Update: 2023-01-02 11:03 GMT
దేశంలో బీజేపీ తర్వాత ప్రాంతీయ, చిన్న పార్టీల్లో బీఆర్ఎస్ టాప్ గా నిలిచింది. కేసీఆర్ కు విరాళాల వాన కురుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సీజన్ లేనప్పటికీ గులాబీ పార్టీకి డొనేషన్లు భారీగానే వచ్చాయి. దేశవ్యాప్తంగా మరే ప్రాంతీయ, చిన్న పార్టీకి లేనంతగా గరిష్ట స్థాయిలో అటు ఎటక్టోరల్ ట్రస్టుల ద్వారా, ఇటు బాండ్ల ద్వారా కేవలం సంవత్సర కాలంలోనే రూ.193 కోట్ల మేర సమకూరాయి. వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ఈ పార్టీకి సమకూరింది కేవలం రూ.90 లక్షలే. కానీ గోప్యం ఉండిపోయేందుకు ట్రస్టుల ద్వారా, బాండ్ల ద్వారా విరాళాలు వచ్చి పడ్డాయి.

ఇప్పటికే  పార్టీకి సుమారు రూ.1000 కోట్ల మేర స్థిర, చరాస్థులు ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీ సందర్భంగా శ్రేణులకు తెలిపారు. దీనికి అదనంగా రూ.193 కోట్లు ఈ ఒక్క సంవత్సరమే చేరినట్లయ్యింది. ఇవన్నీ అక్టోబరు, నవంబరు మాసాల్లో వచ్చిన విరాళాలే..

వైసీపీ,ఆమ్ ఆద్మీ, డీఎంకే , యూపీలో సమాజ్ వాదీ పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చినవీ ఎక్కువ. అన్ని ట్రస్టుల ద్వారా కలిపి 2022లో వేర్వేరు రాజకీయ పార్టీలకు ఫండింగ్  కోసం రూ.487 కోట్లు వస్తే అందులో దాదాపు 10శాతం మేర ఒక్క బీఆర్ఎస్ కే దక్కాయి. అత్యధికంగా బీజేపీకి 72 శాతం చేరాయి.

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎలాంటి విరాళాలు ట్రస్టుకు అందకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లోని పార్టీలకు కలిపి రూ.60 కోట్ల మేర వచ్చాయి. ట్రస్టుకు విరాళం ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలు ఫలానా  పార్టీ కోసమంటూ చెప్పడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈ రెండు పార్టీలకు అందాయి. అదే సమయంలో దేశం మొత్తం మీద కేవలం ఎస్బీఐ మాత్రమే ఎలక్ట్రోరల్ బాండ్ల విక్రయాలు జరగ్గా అందులో బీఆర్ఎస్ కు రూ.153 కోట్లు వచ్చాయి.

ఏకకాలంలో బాండ్ల ద్వారా, ట్రస్టుల ద్వారా విరాళాలు భారీ స్థాయిలో బీఆర్ఎస్ కు రావడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News