20 ఏళ్లు.. 148 లక్షల కోట్ల ఖర్చు , గెలవని యుద్ధం : బైడెన్ కీలక ప్రకటన ?

Update: 2021-07-09 06:30 GMT
ఇరవై ఏళ్లు .. రెండు లక్షల డాలర్ల భారీ ఖర్చు , వేలాది మంది ప్రాణాలు , లక్షలాది మందికి గాయాలు ..ఇవేవీ కూడా చివరికి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీనితో ఇక అలసిపోయిన అమెరికా 20 ఏళ్ల వైరానికి ముగింపు చెప్పాలని నిర్ణయం తీసుకుంది. అసలు యుద్ధం ఏ పరిస్థితుల్లో మొదలైందో , నేడు ముగిసే సమయానికి కూడా అవే పరిస్థితులు ఉండటం గమనార్హం. అఫ్గానిస్తాన్ లో రెండు దశాబ్దాలపాటు అమెరికా చేసిన యుద్దం ఎట్టకేలకు  ఈ ఏడాది ఆగస్టు 31తో  పూర్తి స్థాయిలో అంతం కానుందని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికా వాణిజ్య రాజధాని అయిన న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ బాంబ్ తో పేల్చడం, రక్షణ కేంద్రం పెంటగాన్  పై బాంబుల వర్షం అలాగే మరికొన్ని సంఘటనల సమాహారమైన 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదుల ఏరివేత, అల్ కాయిదా చీఫ్ బిన్ లాడెన్ వేట కోసం అమెరికా 2001 అక్టోబర్ లో అఫ్గానిస్థాన్ పై యుద్ధం మొదలుపెట్టారు.

అయితే , యుద్ధం అసలు లక్ష్యాలు ఎప్పుడో దారి తప్పగా, పాకిస్తాన్ లో లాడెన్ ను సైతం మట్టుపెట్టిన తర్వాత కూడా అది కొనసాగుతూ వచ్చిని. ఆ తర్వాత  రెండు దశాబ్దాల యుద్ధాన్ని ముగిస్తానని గత అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. ఆ దిశగా అఫ్గాన్ లోని అమెరికా సేనలను వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చివరికి జోబైడెన్ హయాంలో యుద్ధం అధికారికంగా ముగింపు దశకు చేరింది. అఫ్గాన్ తో యుద్ధం ముగింపు పై అమెరికా అధినేత జో బైడెన్ గురువారం నాడు కీలక ప్రకటన చేశారు.  అమెరికా, అఫ్గాన్ పోరును గెలవలేని యుద్ధంగా చెప్పిన బైడెన్  20 ఏళ్ల కిందట తాము మొదలుపెట్టిన పనికి సైనిక పద్ధతిలో పరిష్కారం లభించే అవకాశమే లేదని ఒప్పుకున్నారు. ఇంకా ఎన్ని వేల మంది అమెరికన్ బిడ్డల ప్రాణాలను పణంగా పెట్టాలి? అఫ్గానిస్థాన్ లో మిలటరీ ఆపరేషన్ కోసం అమెరికాకు చెందిన మరో తరాన్ని కూడా నేను బలిపెట్టలేను. అందుకే యుద్ధాన్ని పూర్తి స్థాయిలో ముగించబోతున్నాను. ఆగస్టు 31తో యూఎస్-అఫ్గాన్ వార్ అధికారికంగా ముగుస్తుందని ప్రెసిడెంట్ బైడెన్ వైట్ హౌజ్ లో ప్రకటన చేశారు. అఫ్గాన్ యుద్ధంలో అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20,666 మంది గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్టు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది 3,800 మంది, నాటో దేశాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు. 47,245 మంది అఫ్గాన్‌ పౌరులు, 69 వేల మంది వరకూ అఫ్గాన్‌ సైనికులూ మృతిచెందారు.

అయితే , 20 ఏళ్ల పాటు  అఫ్గానిస్థాన్ నేలను నాశనం చేసి, తాలిబన్లను పూర్తిగా ఏరేయకుండానే అమెరికా సేనలు వెళ్లిపోవడం అన్యాయమంటూ అఫ్గాన్ పాలకులు, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న విమర్శలకూ జో బైడెన్ స్పందించారు. మేం అఫ్గానిస్థాన్ వెళ్లింది జాతి నిర్మాణం కోసం కానేకాదు. అఫ్గాన్ భవిష్యత్తు నిర్మాణం అక్కడి నేతల చేతుల్లోనే ఉంది. ఆ దేశ సైన్యంపై నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. తాలిబన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు అని బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా సేనల నిష్క్రమణ దాదాపు చివరి దశకు చేరడంతో తాలిబన్లు మళ్లీ ఆయా ప్రాంతాలపై పట్టు బిగిస్తున్నాయి. దీంతో చాలా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. అఫ్గాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లే సమయం మరెంతో దూరంలో లేదని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

గత 20 ఏళ్లలో అఫ్గాన్‌లో యుద్ధం కోసం అమెరికా 2లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు బ్రౌన్‌ యూనివర్సిటీ అంచనా వేసింది.  బిన్ లాడెన్ సారథ్యంలోని అల్‌ఖైదా, తాలిబన్లను సమూలంగా ఏరివేస్తామని అఫ్గనిస్థాన్‌ గడ్డపై కాలుమోపిన అమెరికా.. ఏం సాధించకుండానే వెనక్కి మళ్లుతోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్లకు స్వేచ్ఛను ప్రసాదిస్తామని రొమ్ములు విరుచుకుంటూ వచ్చిన అమెరికా సైన్యం.. వారితోనే రాజీపడి స్వదేశానికి జారుకుంటోంది. తమ ప్రధాన శత్రువు లాడెన్‌ను హతమార్చిన తర్వాత అమెరికా పోరాటంలో క్రమంగా వేడి తగ్గింది. 2014 తర్వాత అమెరికా సేనలు దాడులు చేయటం దాదాపు ఆపేశాయి. ఒక్క ఉగ్రవాద వ్యతిరేక దళాలు మాత్రమే చురుగ్గా ఉన్నాయి.
Tags:    

Similar News