2వేల కోట్లతో దాయాదికి దెబ్బేయనున్న మోడీ

Update: 2016-12-01 07:16 GMT
నిర్ణయాలు తీసుకునే విషయంలో తెగువను ప్రదర్శించే విషయంలో ప్రధాని మోడీ తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేందుకు మోడీ ఎంత మొండిగా వ్యవహరిస్తారో ఇప్పటికే తెలిసిన పరిస్థితి. పాక్ పీచమణిచే విషయంలో సమకాలీన ప్రధానుల్లో ఎవరూ చేయనటువంటి పనుల్ని మోడీ చేశారని చెప్పాలి. చేజేతులారా.. కశ్మీర్ లోని కొంత భాగాన్ని పాక్ కు అప్పగించిన వైనం ఒకటైతే.. పాక్ అక్రమిత కశ్మీర్ పై మనకున్న హక్కుపై గళం విప్పేందుకు గత ప్రభుత్వాలు విపరీతంగా జంకేవి.

ఇప్పుడా పరిస్థితి మారటమే కాదు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనన్న విషయాన్ని కేంద్రం పదే పదే పలు వేదికల మీద స్పష్టం చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలకు కొత్త ఆశలు కలిగించటమే కాదు.. వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచేలా మోడీ చర్యలు తీసుకుంటున్నారు. ఆయన నిర్ణయాలతో ఇప్పటికే పాక్ అక్రమిత కశ్మీర్ లోని ప్రజల్లో మోడీ మీద అభిమానం అంతకంతకూ పెరగటం ఒక ఎత్తు అయితే.. పాక్ నియంతృత్వ పాలనపై వారి ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇవన్నీ దాయాది పాక్ కు జీర్ణించుకోలేని అంశాలుగా మారుతున్నాయి. ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చేసిన శరణార్థులకు భారీగా ఆర్థిక సాయాన్ని అందించే ప్లాన్ ను మోడీ ప్రకటించారు. పాక్ అక్రమిత కశ్మీర్ ను విడిచి పెట్టేసి శరణార్థులుగా ఉంటున్న వారికి సాయం అందించేందుకు వీలుగా రూ.2వేల కోట్లతో ఒక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నారు.

పాక్ అక్రమిత కశ్మీర్ నుంచి వచ్చేసిన శరణార్థుల సంఖ్య దాదాపు 36,384 కుటుంబాలు ఉంటాయని చెబుతున్నారు. వీరిలో అత్యధికులు జమ్మూ ప్రాంతంలోనే నివసిస్తూ ఉండటం గమనార్హం. తాజాగా నిర్వహించిన క్యాబినెట్ లో పాక్ అక్రమిత కశ్మీర్ శరణార్థులకు ఒకేసారి రూ.5.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇది.. పాక్ అక్రమిత కశ్మీర్ లోని ప్రజలపై ప్రభావాన్ని చూపటమే కాదు.. అంతిమంగా దాయాదిపై తీవ్ర ఒత్తిడి పెరిగేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News