2001 టీఆర్ఎస్.. సిద్దిపేట- 2022 బీఆర్ఎస్.. మునుగోడు.. భలే లెక్

Update: 2022-10-09 01:30 GMT
సరిగ్గా 21 ఏళ్ల కిందట.. ఇంకా చెప్పాలంటే 2001 సెప్టెంబరు 20.. నాటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గానికి ఉప ఎన్నిక. నాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించి, ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్). 72 శాతం ఓట్లతో గెలుపొంది తెలంగాణ వాదానికి ప్రాథమిక ఆమోద ముద్ర పొందారు. అనంతరం అనేక పోరాటాలు, అవమానాలు, ఎత్తుగడలతో 2014లో తెలంగాణనే సాధించి నాటి తన నిర్ణయానికి సంపూర్ణ న్యాయం చేశారు. ఇదంతా చరిత్ర. మొత్తమ్మీద చూస్తే 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పురుడు పోసుకోగా.. ఆర్నెల్లలోపే జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలుపొందారు.

మళ్లీ ఇప్పుడు

2022 అక్టోబరు 5.. దసరా నాడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటు. 2001లో ఎవరైతే టీఆర్ఎస్ ను స్థాపించి తెలంగాణను సాధించి సీఎం అయి ఆ పార్టీని తిరుగులేని స్థాయిలో నిలిపారో.. అదే కేసీఆర్ బీఆర్ఎస్ కు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. చిత్రమేమంటే.. 2001లో టీఆర్ఎస్ స్థాపన అనంతరం సిద్దిపేటకు ఉప ఎన్నిక రాగా, నేడూ బీఆర్ఎస్ పుట్టాక నెలలోపే మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొననున్నారు. రెండు పార్టీల స్థాపన ఒకరే చేయడం.. ఆ వెంటనే ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక రావడం.. అదీ ఉప ఎన్నిక కావడం ఇదంతాఅనుకోకుండానే జరిగినా.. యాక్సిడెంటల్ కావడం విశేషం.


నాడు.. నేడు సవాలే

2001లో సిద్దిపేట ఉప ఎన్నిక.. 2022లో మునుగోడు ఉప ఎన్నిక రెండూ కేసీఆర్ కు ప్రతిష్ఠాత్మకమే అయ్యాయి. నాడు టీఆర్ఎస్ స్థాపన అనంతరం సిద్దిపేటలో గనుక గెలవకపోతే.. తెలంగాణ వాదానికి బలం లేదని, సొంత సీట్లోనే కేసీఆర్ ఓడారని ఉమ్మడి ఏపీలో ప్రచారం జరిగేది. ఇప్పుడు కూడా జాతీయ పార్టీ అంటూ బీఆర్ఎస్ స్థాపన అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ నిలిపిన అభ్యర్థి ఓడిపోతే బీఆర్ఎస్ ప్రస్థానానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడినట్లు అవుతుంది.

అప్పుడు కేసీఆర్ ఒక్కరే.. నేడు 100 మంది

టీఆర్ఎస్ స్థాపన తర్వాత తొలిగా గెలిచింది కేసీఆర్ ఒక్కరే. ప్రస్తుతం దాదాపు 100 మంది ఎమ్మెల్యేల బలం ఆ పార్టీ సొంతం. అంటే.. బీఆర్ఎస్ పుట్టుకతోనే వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు. ఇక టీఆర్ఎస్ ఎదుర్కొన్న తొలి ఎన్నికలో అభ్యర్థి కేసీఆర్ 70 శాతంపైగా ఓట్లు తెచ్చుకున్నారు. నాడు కూడా సిద్దిపేటలో ముక్కోణపు పోటీ జరిగింది. కేసీఆర్ 82,632 ఓట్లు సాధించగా, అప్పటి అధికార పార్టీ టీడీపీ తరఫున బరిలో దిగిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి 23,920 ఓట్లు పొందారు. మూడో అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి వంగా హనుమంత రెడ్డి నిలిచారు.

ఈయనకు 3,317 ఓట్లు మాత్రమే వచ్చాయి. చిత్రమేమంటే.. ఇప్పుడు కూడా మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీనే జరగబోతోంది. నాడు సిద్దిపేటలో కొత్త పార్టీగా బరిలో నిలిచిన టీఆర్ఎస్ నేడు అధికార పార్టీగా బరిలో ఉండగా.. అప్పటి ప్రధాన పార్టీల్లో ఒకటైన టీడీపీ ఉనికిలోనే లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News