గుడ్ న్యూస్: ఐటీలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు

Update: 2018-01-02 05:22 GMT
2017 సంవ‌త్స‌రంలో తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొన్న సాఫ్ట్‌ వేర్ ఉద్యోగుల‌కు తీపిక‌బురు. ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌ధానంగా సాఫ్ట్‌ వేర్ ప‌రిశ్ర‌మ నుంచి తీపిక‌బురు వ‌చ్చింది. దేశీయ ఉపాధి మార్కెట్ 2018లో పుంజుకోవడం ఖాయమని, కొత్త సంవత్సరంలో ఒక్క ఐటీ రంగంలోనే అదనంగా 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) లాంటి ఆధునిక టెక్నాలజీలు రంగప్రవేశం చేయడంతో ప్రస్తుతం దేశీయ ఉపాధి మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదని, ఈ పరివర్తన దశను అధిగమించి మనుగడ సాగించాలంటే ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవడమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేశారు.

ఆటోమేషన్ టెక్నాలజీల వినిమయం పెరుగుతుండటం కొన్ని రంగాల్లోని ఉద్యోగులు ఉపాధిని కోల్పోయేందుకు దారితీస్తుందని ఐటీ ఉద్యోగ సేవల సంస్థ టీమ్‌ లీజ్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ అల్కా ధింగ్రా తెలిపారు. అయితే మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ - ఫిన్‌ టెక్ - స్టార్టప్స్ లాంటి రంగాలు పురోగమన దిశలో కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నదని ధీమా వ్య‌క్తం చేశారు. ఆర్థిక సేవలు - డిజిటల్ వ్యాపార రంగాల్లో పరిస్థితులు మెరుగుపడటం - ప్రత్యేకించి డిజిటైజేషన్ - ఆటోమేషన్ రంగాల్లో పెట్టుబడులు పెరిగి సానుకూల వాతావరణం ఏర్పడటం వ్యాపార వృద్ధికి దోహదం చేస్తాయని విశ్లేషించారు. స్థూలంగా ఈ ఏడాది ఉద్యోగుల నియమకాలు పెరిగే అవకాశం ఉందని - కొత్త సంస్థలతో పాటు - ప్రస్తుతం ఉన్న వాటిలో 20 శాతం సంస్థల యజమానులు తమ సంస్థల్లో ఉద్యోగులను నియమించుకోవాలని ఎదురు చూస్తుండటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.

దేశీయ ఐటీ పరిశ్రమ ఈ ఏడాది కొత్తగా 1.8 లక్షల నుంచి 2 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిజిటలైజేష‌న్ కోసం డిజిటల్‌ సాంకేతికతలో నైపుణ్యం ఉన్న 50 శాతం మంది అదనంగా అవసరమని పేర్కొన్నారు. 2030 నాటికి అంతర్జాతీయంగా కృత్రిమమేధ ఒక్కటే 23 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.
Tags:    

Similar News