'2023.. ఆర్థిక మాంద్య' నామ సంవ‌త్స‌రం!: ప్ర‌పంచ బ్యాంకు నివేదిక‌

Update: 2022-09-20 02:30 GMT
ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు మళ్లీ ఈ పదం తరచూ వినిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోని పలు దశల్లో ఇదీ ఒక భాగమే. అయినప్పటికీ.. ఇది ఒక ప్రమాదకరమైన హెచ్చరిక. నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆర్జన శక్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం లాంటివి ఈ సమయంలో చూస్తుంటాం. కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలూ తగ్గిపోవడం లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విష‌యాన్ని ప్ర‌పంచ బ్యాంకు తాజాగా వెల్ల‌డించింది. 2023 ఆర్థిక మాంద్య నామ సంవ‌త్స‌రంగా మారినా అనుమానం లేద‌ని.. బ్యాంకు త‌న నివేదిక లో స్ప‌ష్టం చేసింది. అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు 2023లో మాంద్యంలోకి జారుకుంటాయని ఈ నివేదికలు  పేర్కొంటున్నాయి.

కార‌ణాలు ఏంటి?

ప్ర‌పంచంలో 2023లో ఆర్థిక మాంద్యం రావ‌డానికి కొన్ని కార‌ణాలు కూడా ప్ర‌పంచ బ్యాంకు పేర్కొంది. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని మార్చడం, అదే సమయంలో వడ్డీ రేట్లను పెంచడం వల్ల 2023లో ప్రపంచ దేశాలు మాంద్యం వైపు పయనించవచ్చని హెచ్చరించింది.  గత 50 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా వడ్డీ రేట్లు పెరగటం గ‌మ‌నించ వ‌చ్చ‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. ప్రస్తుత వేగంతో చర్యలు కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మెల్లగా మాంద్యం ఛాయలు ప్రారంభమవుతాయని వ్యాఖ్యానించింది.

ఇప్ప‌టికే ఆదిశ‌గా!

ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 1970ల మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తన నివేదికలో పేర్కొంది.

సెంట్రల్ బ్యాంకులు వచ్చే ఏడాది గ్లోబల్ మానిటరీ పాలసీ రేట్లను 4 శాతానికి పెంచవచ్చు. 2021లో ఈ రేట్లు సగటున రెట్టింపు అవుతాయని, ప్రధాన ద్రవ్యోల్బణం కేవలం 5 శాతంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టకపోతే ఈ రేటు 6 శాతం వరకు పెరగవచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇది మాంద్యానికి మొద‌టి మెట్టుగా కూడా పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపు ఇలాగే కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారతాయని తెలుస్తోంది.

జీడీపీ వృద్ధి తగ్గుదల, తలసరి ఆదాయం తగ్గుదల వల్ల సాంకేతికంగా ప్రపంచం ఆర్థిక మాద్యంలోకి చేరుకుంటుందని, ప్రపంచ వృద్ధి బాగా మందగించింద‌ని, మరిన్ని దేశాలు మాంద్యంలోకి పడిపోవడంతో ఆర్థికంగా మరింత మందగించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజలకు దీర్ఘకాలిక పరిణామాలు వినాశకరమైనవిగా ఉంటాయని అన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News