షాకింగ్: వాయు కాలుష్యంలో టాప్ సిటీ భార‌త్‌ లోనే!

Update: 2020-02-26 03:30 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోన్న సంగ‌తి తెలిసిందే. నానాటికీ పెరుగుతున్న భూ తాపంతో వాతావ‌ర‌ణంలో అసాధార‌ణ మార్పులు వ‌స్తుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. క‌ర్బ‌న ఉద్గారాలు - వాయు కాలుష్యం వంటి ప‌రిణామాల‌తో మాన‌వాళికి పెనుముప్పు ఏర్ప‌డింద‌ని ప్ర‌పంచ దేశాల‌న్నీ ముక్త‌కంఠంతో వెల్ల‌డించాయి. గ్లోబ‌ల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు భార‌త్ ధృఢ సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్ప‌టికీ కాలుష్యపు మ‌హ‌మ్మారి కోర‌ల నుంచి మాత్రం భార‌త్ బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. తాజాగా ఐక్యూ ఎయిర్ విజువల్స్ సంస్థ వెల్ల‌డించిన నివేదిక‌లో భార‌త్‌ లో వాయు కాలుష్యం శాతం స‌గటు భార‌తీయుడిని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాయు కాలుష్యం కలిగిన నగరంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఘ‌జియాబాద్ రికార్డు క్రియేట్ చేసింది.

ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం కలిగిన 30 నగరాలలొ 21 నగరాలు భారత్‌ లోనే ఉండ‌డం షాక్‌ కు గురి చేస్తోంది. ఐక్యూ ఎయిర్ విజువల్స్‌ 2019 వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ పేరుతో విడుదల చేసిన నివేదికలోని టాప్ టెన్ నగరాల్లో ఆరు భారత్‌ లోనే ఉండ‌డం విశేషం. 2019లో ఘ‌జియాబాద్‌లో సగటు ఎయిర్‌ క్వాలిటీ 110.2గా న‌మోదైంది. 2018లో 135.2 ....2017లో 144.6గా నమోదైంది. గ‌త ఏడాది ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 800 రికార్డు కావ‌డంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఏర్ప‌డింది. చిన్న సైజ్‌లో ఉండే పార్టికిల్స్ వ‌ల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సోకి ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నార‌ని నివేదిక వెల్ల‌డించింది. వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 మిలియన్ మంది పిల్లలు త‌ల్లి కడుపులోనే తుదిశ్వాస విడుస్తున్నారని వెల్లడించింది.

పట్టణ ప్రాంతాల్లోని 80శాతం ప్ర‌జ‌లు కాలుష్యం బారిన ప‌డుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 2018 నుంచి 2019 వరకు కాలుష్య నగరాల సంఖ్య తగ్గింద‌ని వెల్ల‌డించింది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్లే సాధ్యమైందని నివేదిక వెల్లడించింది. కాలుష్యంపై పోరులో భాగంగా `నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం`ను భార‌త్  ప్రారంభించింది. 2024కల్లా 102 నగరాల్లో 20 నుంచి 30 శాతం కాలుష్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. గ్రీన్ హౌజ్ వాయువుల విడుదల త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. విద్యుత్ ఉత్ప‌త్తికి బొగ్గు కాకుండా ప్ర‌త్యామ్నాయాల‌వైపు దృష్టి సారించింది.
Tags:    

Similar News